Site icon NTV Telugu

Health Tips: మధ్యాహ్నం కునుకు మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Afternoon Nap

Afternoon Nap

Health Tips: చాలా మందికి మధ్యాహ్నం భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం అలవాటు. కొందరు దీనిని అలసటను తగ్గించుకునే మార్గంగా భావిస్తే, మరికొందరు సోమరితనానికి చిహ్నంగా చూస్తారు. అయితే, మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది మనం నిద్రపోయే సమయం, వ్యవధి (Duration) పై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ స్టోరీలో మధ్యాహ్నం కునుకు మంచిదేనా, కాదా అనేది తెలుసుకుందాం.

READ ALSO: Renu Desai: అనసూయ తర్వాత ఇప్పుడు రేణు దేశాయ్.. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే జైలుకే!

చిన్న కునుకుతో కలిగే ప్రయోజనాలు ఇవే..
రాత్రిపూట సరిగ్గా నిద్రపోని వారికి లేదా విపరీతమైన శారీరక శ్రమ చేసే వారికి మధ్యాహ్నం కునుకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం 20 నుంచి 30 నిమిషాల చిన్న నిద్ర మెదడుకు విశ్రాంతినిచ్చి, మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుందంటున్నారు. ఇది ఏకాగ్రతను, పని సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. బాగా అలసిపోయిన వారు 45 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకోవచ్చని, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.

ఎక్కువసేపు నిద్రిస్తే వచ్చే నష్టాలు ఇవే..
మధ్యాహ్నం నిద్ర గంటకు మించితే అది ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గంట కంటే ఎక్కువ సేపు నిద్రపోయి లేచిన తర్వాత తల బరువుగా ఉండటం, నీరసం, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోవడం వల్ల రాత్రిపూట నిద్ర పట్టడం కష్టమవుతుందని, ఇది శరీరంలోని ‘స్లీప్-వేక్ సైకిల్’ను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది అలవాటుగా మారితే శారీరక శ్రమ తగ్గి, బద్ధకం పెరుగుతుందన్నారు. తద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.

గాఢ నిద్ర కోసం సింపుల్ టిప్స్..
మంచి ఆరోగ్యానికి రాత్రిపూట నాణ్యమైన నిద్ర అవసరం. దాని కోసం ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు..

* స్థిరమైన సమయం: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి.

* గ్యాడ్జెట్స్‌కు దూరం: పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, టీవీలు చూడటం మానేయాలి.

* ఆహారం: రాత్రిపూట తేలికపాటి భోజనం చేయాలి. పడుకునే ముందు టీ, కాఫీ వంటి కెఫీన్ పదార్థాలను నివారించాలి.

* ప్రశాంతమైన వాతావరణం: పడకగది శుభ్రంగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి.

మధ్యాహ్నం నిద్రను కేవలం ఒక ‘చిన్న విరామం’లా మాత్రమే పరిగణించాలి. 30 నిమిషాలకు మించకుండా చూసుకుంటే అది మీ శరీరానికి శక్తినిస్తుంది, అంతకు మించితే మాత్రం మీ ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని చెబుతున్నారు.

READ ALSO: Sarke Chunar Song: ఇదేం పోయే కాలం.. బూతు పాటని తెలిసి పాడిందా! నెటిజన్లు ఫైర్..

Exit mobile version