NTV Telugu Site icon

Jasprit Bumrah: నేను పాత బుమ్రానే.. కెరీర్‌ ముగిసిందనే ఆలోచనే రానివ్వలేదు!

Jasprit Bumrah Interview

Jasprit Bumrah Interview

Team India Captain Jasprit Bumrah Says I never thought that my career is over: వెన్నెముక గాయంకు శస్త్రచికిత్స కారణంగా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. 11 నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చివరగా ఆస్ట్రేలియాతో 2022 సెప్టెంబర్‌లో టీ20 ఆడాడు. గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌ 2022కు దూరమయ్యాడు. ఆ ప్రభావం భారత జట్టుపై భారీగానే పడింది. త్వరలో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ 2023 ఉన్న నేపథ్యంలో బుమ్రా ఎప్పుడు జట్టులోకి వస్తాడు? అని అందరూ ఎదురుచూశారు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ద్వారా బూమ్ బూమ్ బుమ్రా ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు జట్టును నడిపించే బాధ్యతను కూడా మోయనున్నాడు.

తొలి టీ20 నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జస్ప్రీత్‌ బుమ్రా పలు కీలక వాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలి మ్యాచ్‌ ఆడేందుకు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నానన్నాడు. ‘భారత జట్టులోకి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను 100 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నా. ఎన్‌సీఏలో చాలా కష్టపడ్డా. అక్కడే సుదీర్ఘ కాలం పాటు గడిపా. మైదానంలో అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నా. నెట్స్‌లో బౌలింగ్‌ చేసేటప్పుడు నా శరీరం మీద ఒత్తడి లేకుండా చూసుకున్నా. ఎన్‌సీఏ నుంచి బయటకు వచ్చాక గుజరాత్ టైటాన్స్ జట్టుతో ప్రాక్టీస్ చేశా. అనంతరం చాలా చోట్ల నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నా. చాలా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా ఆడా’ అని బుమ్రా తెలిపాడు.

Also Read: IRE vs IND: నేడే ఐర్లాండ్‌తో తొలి టీ20.. అందరి కళ్లు అతడిపైనే!

‘టీ20 మ్యాచ్‌ కోసం కాదు.. ప్రపంచకప్‌ 2023 కోసమే సన్నద్ధమయ్యా. ఎన్‌సీఏలో 10-15 ఓవర్ల పాటు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశా. ప్రాక్టీస్‌లో ఎక్కువ ఓవర్లు వేశా కాబట్టి టీ20 మ్యాచ్‌ల్లో తక్కువ ఓవర్లు వేయడం చాలా సులువు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగినా అంచనాల గురించి ఆలోచించడం లేదు. ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా. నేను పాత బుమ్రానే. నమ్మకం ఎప్పుడూ కోల్పోలేదు. గాయం చిరాకు కలిగిస్తుంది, మన విశ్వాసం సన్నగిల్లేలా చేస్తుంది. అయితే నేను తిరిగి ఫిట్‌నెస్‌ సాధించి జట్టులోకి రావాలనే దానిపైనే దృష్టి పెట్టా. ఇదో చీకటి దశ అనుకోలేదు. కెరీర్‌ ముగిసిందనే ఆలోచనే రానివ్వలేదు’ అని జస్ప్రీత్‌ బుమ్రా చెప్పుకొచ్చాడు.

Show comments