భారతదేశం మరోసారి విదేశీ గడ్డపై తన దౌత్య మాయాజాలాన్ని ప్రదర్శించింది. భారత పౌరుల కోసం ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో భారత్ తమ పౌరులను స్వదేశానికి తిరిగి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ భారతీయ విద్యార్థుల కోసం టెహ్రాన్ తన గగనతలాన్ని తెరిచింది. కేవలం భారత్ కోసం మాత్రమే తన గగనతలాన్ని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. దీంతో కనీసం 1000 మంది భారతీయ విద్యార్థులు తమ స్వదేశానికి తిరిగి రావడానికి మార్గం సుగమం అయింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వానికి సంకేతంగా పరిగణిస్తున్నారు.
READ MORE: IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తేలిపోయిన సాయి సుదర్శన్..!
ఇరాన్ తన గగనతలాన్ని భారతదేశానికి మాత్రమే తెరిచింది. ఇరాన్ నిర్ణయంతో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు రాత్రి 1,000 మంది విద్యార్థులు ఢిల్లీకి తిరిగి వస్తారు. మొదటి విమానం రాత్రి 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. రెండవ, మూడవ విమానాలు శనివారం వస్తాయి. వీటిలో ఒకటి ఉదయం, మరొకటి సాయంత్రం చేరుకుంటాయి. కాగా, భారత ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం.. 2025 ప్రారంభం నాటికి, 6,000 మంది విద్యార్థులు సహా మొత్తం 10,000 మంది భారతీయ పౌరులు ఇరాన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. మొత్తం 10,320 మంది భారతీయ పౌరులు ఇరాన్‌లో ఉన్నారు. వీరిలో 445 మంది భారత సంతతికి చెందినవారే. వారిని తిరిగి మనదేశానికి రప్పించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి.