Site icon NTV Telugu

Morality Police: సుదీర్ఘ నిరసనల తర్వాత దిగొచ్చిన ఇరాన్‌.. నైతిక పోలీసు విభాగం రద్దు

Morality Police

Morality Police

Morality Police: రెండు నెలలకు పైగా నిరసనల తర్వాత ఎట్టకేలకు ఇరాన్ ప్రభుత్వం దిగొచ్చింది. దేశంలోని కఠినమైన మహిళా దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలపై మహ్సా అమిని అరెస్టు చేయడం వల్ల రెండు నెలలకు పైగా నిరసనలు జరిగాయి. మహ్సా అమిని మృతికి కారణమైందని నైతికత పోలీసు విభాగాలను రద్దు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో అమీని అనే యువతి హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు ఆమెను అరెస్టు చేయగా.. ఈ క్రమంలోనే వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి ఆమె మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహ్సా అమిని సెప్టెంబర్ 16న కస్టడీలో మృతి చెందగా.. పోలీసులు దాడి చేయడం వల్లే ఆమె మృతి చెందిందనే ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్‌ 17న నిరసనలు మొదలయ్యాయి. క్రమంగా ఉద్ధృతంగా మారి.. రాజధాని టెహ్రాన్‌తోసహా దేశవ్యాప్తంగా అనేక చోట్లకు వ్యాపించాయి. రెండు నెలలకుపైగా ఇప్పటికీ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మహిళల నేతృత్వంలోని నిరసనలు ఇరాన్‌ను చుట్టుముట్టాయి.

ప్రదర్శనకారులు వారి తప్పనిసరి హిజాబ్ తల కవచాలను తగులబెట్టడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మహ్సా అమిని మరణించినప్పటి నుంచి ముఖ్యంగా టెహ్రాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు అధిక సంఖ్యలో హిజాబ్ ధరించడాన్ని ఆపేశారు. “నైతిక పోలీసు విభాగానికి న్యాయవ్యవస్థతో సంబంధం లేదు. దాన్ని రద్దు చేశాం’ అని ఇరాన్‌ దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మోంటజేరి ప్రకటించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. ఒక మతపరమైన సమావేశంలో “నైతిక పోలీసులను ఎందుకు రద్దు చేస్తున్నారు?” అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పినట్లు తెలిసింది.

Vladimir Putin: ఇంట్లో మెట్లపై నుంచి పడిపోయిన పుతిన్‌

నైతిక పోలీసుల విభాగం అనేది ఇరాన్‌లో ప్రత్యేక పోలీసు విభాగం కాగా.. ఇది ఇస్లామిక్ దుస్తుల కోడ్‌లు, బహిరంగంగా ఇతర ప్రవర్తనలపై చట్టాలను అమలు చేయడంలో పని చేస్తుంది. ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని ఇరానీయన్ చట్టంలో ఉంది. దీనిని ఉల్లంఘించిన వారిపై ఈ పోలీసులు చర్యలు తీసుకుంటారు. అయితే నైతికత పోలీసులు మహిళలను యథేచ్ఛగా నిర్బంధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్‌లో షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన బాలికలు, మహిళలు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ పాటించాలి. తమ జుట్టును పూర్తిగా కప్పి ఉంచేలా హిజాబ్‌ ధరించాలి. హిజాబ్‌ చట్టాన్ని ఉల్లంఘించే మహిళలను అరెస్టు చేసేందుకు కూడా వీలు కల్పించారు. ఆ చట్టం అమలును పర్యవేక్షించేందుకు 2005లో ఇరాన్‌లో ఏర్పాటైన ప్రత్యేక పోలీసు విభాగాన్ని స్థానికంగా ‘గస్త్-ఎ-ఇర్షాద్’గా లేదా “గైడెన్స్ పెట్రోల్” అని పిలుస్తారు. అక్కడి ప్రజలు చట్టం ప్రకారం దుస్తులు ధరించేలా చూడడం, ఇస్లామిక్‌ చట్టాలను గౌరవించేలా చర్యలు తీసుకోవడం ఈ విభాగం విధులు.

Exit mobile version