NTV Telugu Site icon

DS Chauhan : సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డీఎస్‌ చౌహాన్‌ కు రెండు అవార్డులు

Ds Chauhan

Ds Chauhan

సీనియర్‌ పోలీస్‌ అధికారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌కు ఒకేరోజు రెండు అత్యుత్తమ అవార్డులు లభించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కేంద్రం ప్రకటించే ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు డీఎస్‌ చౌహాన్‌ ఎంపికయ్యారు. దీంతోపాటు బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు(2024) కూడా ఆయనకు లభించింది. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా 2023 శాసన సభ ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకుగానూ ఎన్నికల సంఘం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును గురువారం నాడు జెఎన్‌టియులో జరిగిన ఓటర్స్‌డే సెలబ్రేషన్స్‌ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ చేతులమీదుగా బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును డీఎస్‌ చౌహాన్‌ అందుకున్నారు. ఒకే రోజు రెండు అవార్డులు రావడం పట్ల పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యం అయిందని ఈ సందర్భంగా డీఎస్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 2023 శాసన సభ ఎన్నికలు సజావుగా సాగడానికి సహకరించిన ప్రతి ఒక్క పోలీస్‌ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. రిపబ్లిక్‌ డే సందర్భంగా పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు కేంద్ర హోం శాఖ వివిధ పోలీసులు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ పతకాలు అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 275 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 753 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది.

వీరిలో తెలంగాణ నుంచి 20 మందికి పతకాలు దక్కాయి. అందులో రాష్ట్రానికి 6 గ్యాలెంటరీ, 12 ఉత్తమ ప్రతిభ, 2 రాష్ట్రపతి అవార్డులు ఉన్నాయి. సీనియర్‌ పోలీసు అధికారి దేవేంద్ర సింగ్‌ చౌహాన్, అదనపు డీజీ సౌమ్య మిశ్రాకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు దక్కాయి. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక ఏఆర్‌ ఎస్సై, 12 మంది అధికారులు విశిష్ట సేవ పతకాలు లభించాయి. వీరితోపాటు ఇద్దరు జైళ్ల శాఖ అధికారులు ప్రెసిడెంట్‌ మెడల్స్‌ అందుకోనున్నారు. ఇక ఉత్తమ ప్రతిభ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు 9 అవార్డులు దక్కాయి.