NTV Telugu Site icon

RR Retention List: ఆరుగురిని రిటైన్ చేసుకున్న రాజస్థాన్.. మొదటి ఎంపిక ఎవరంటే?

Samson, Jaiswal

Samson, Jaiswal

ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఇప్పటికే ఐపీఎల్‌ పాలక వర్గం అనుమతించింది. ఇందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఉంటుంది. రిటైన్ జాబితాను ప్రకటించడానికి అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నా.. ఇప్పటివరకు ఏ జట్టు కూడా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకుందని తెలుస్తోంది.

టీమిండియా ప్లేయర్స్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జరెల్‌, రియాన్ పరాగ్‌లను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకుందని తెలుస్తోంది. శాంసన్ మొదటి ఎంపికగా ఉన్నాడు. అతడికి 18 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పరాగ్‌కు 14 కోట్లు, జరెల్‌కు 11 కోట్లు ఇవ్వడానికి రాజస్థాన్ సిద్దమైందని సమాచారం. జైస్వాల్‌కు 18 కోట్లు, జోస్ బట్లర్‌కు 14 కోట్లు ఇవ్వనుందట. అన్‌క్యాప్డ్ ప్లేయర్ సందీప్ శర్మను 4 కోట్లకు తీసుకుందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చహల్‌ను వేలంలో తిరిగి దక్కించుకోవాలని చూస్తోందట.

Also Read: IPL Retention 2025: అభిమానులకు శుభవార్త.. మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ!

సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌లు గత 2-3 ఏళ్లుగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌కు మూల స్తంభాలుగా ఉన్నారు. గతేడాది విఫలమైన ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్‌పై నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రిటైన్ జాబితాలో సందీప్ మాత్రమే స్పెసలిస్ట్ బౌలర్. పరాగ్‌ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఫ్రాంచైజీకి తిరిగి వచ్చాడు. దాంతో ఫాన్స్ వేలంపై చాలా ఆసక్తిగా ఉన్నారు.