ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. సోమవారం (నవంబర్ 4)తో ఆటగాళ్ల నమోదు అధికారికంగా ముగియగా.. మొత్తం 1,574 మంది క్రికెటర్లు వేలం కోసం పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయ క్రికెటర్స్ ఉండగా.. 409 మంది విదేశీయులు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వేలంలో చాలా మంది టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరు మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌లు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు ఐపీఎల్ 2025 మెగా వేలంకు వచ్చారు. పలు కారణాల వలన ఈ ముగ్గురు తమ ప్రాంచైజీలను వీడారు. ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలో బరిలో నిలిచారు. వీరికి భారీ ధర పలికే అవకాశం ఉంది. బెంగళూరు, పంజాబ్ జట్లకు కెప్టెన్‌తో పాటు వికెట్ కీపర్ అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో పంత్ కోసం ఈ రెండు టీమ్స్ పోటీపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేలంలో పంత్ ఏకంగా 30 కోట్లకు అమ్ముడుపోతాడని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: Ramayana Update: రెండు పార్టులుగా ‘రామాయణ’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
హిట్టర్లు ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దేవ్‌దత్ పడిక్కల్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలో పేరు నమోదు చేసుకున్నారు. ఆల్‌రౌండర్‌లు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కృనాల్ పాండ్యాల కనీస ధర రూ.2 కోట్లు. బౌలర్లు మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, టి.నటరాజన్, ముకేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షల్ పటేల్ కూడా రూ.2 కోట్ల కనీస ధరతో పేరు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షాల కనీస ధర రూ.75 లక్షలు.