Site icon NTV Telugu

IPL Auction 2025: ఆర్‌సీబీ నిర్ణయంతో సంతోషంగా ఉన్నా.. మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Glenn Maxwell Rcb

Glenn Maxwell Rcb

ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రాంచైజీ ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)ను ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది. చాలామంది స్టార్ ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. 2021 నుంచి జట్టులో ఉన్న ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రిటైన్‌ చేసుకోలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్‌సీబీ తనను అట్టిపెట్టుకోవడంపై తాజాగా మ్యాక్సీ స్పందించాడు.

తనని రిలీజ్ చేసే ముందు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ సుదీర్ఘంగా చర్చించిందని గ్లెన్ మ్యాక్స్‌వెల్ తెలిపాడు. హెడ్‌కోచ్ ఆండీ ప్లవర్, ఫ్రాంఛైజీ డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌ మో బోబాట్ తనతో గంటన్నర మాట్లాడారని, రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారని చెప్పాడు. ఈఎస్‌పీఎన్ అరౌండ్ ది వికెట్ పాడ్‌కాస్ట్‌లో మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ… ‘ఆర్‌సీబీ నుంచి రిలీజ్ చేసే ముందు మో బోబాట్, ఆండీ ఫ్లవర్ నాతో జూమ్ కాల్‌లో మాట్లాడారు. రిటైన్‌ చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారు. జట్టు వ్యూహం, మంచి ఫలితాలు రాబట్టడానికి ఎలా ముందుకు సాగాలనుకుంటున్నారనే విషయాలను చెప్పారు. ఆర్‌సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగానే ఉన్నా’ అని తెలిపాడు.

Also Read: Virat Kohli: అయ్యో విరాట్‌ ఎంతపనాయే.. పదేళ్లలో ఇదే తొలిసారి!

‘ఆర్‌సీబీ సిబ్బందిలో కూడా మార్పులు చేస్తోంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. రిలీజ్ చేసే ముందు ఆటగాళ్లతో మాట్లాడడం మంచి విషయం అని నేను భావిస్తున్నా. ఆర్‌సీబీతో నా ప్రయాణం ముగియలేదు. నేను మరలా జట్టులోకి రావాలనుకుంటున్నాను. ఆర్‌సీబీకి ఆడుతాననే నమ్మకం ఉంది. ఇది ఓ గొప్ప ఫ్రాంఛైజీ. ఐపీఎల్సమయంను బాగా ఆనందించాను’ అని గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. ఆర్‌సీబీలో మ్యాక్సీ కీలక ఆటగాడు అన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నో మ్యాచ్‌ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్ 2024లో 9 ఇన్నింగ్స్‌ల్లో 52 పరుగులే చేసి నిరాశపరిచాడు.

 

Exit mobile version