IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..

District

District

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. ఈ కీలకమైన ప్లేఆఫ్స్ దశ మ్యాచ్‌లకు ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ (District by Zomato) సంస్థ అధికారిక టిక్కెటింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే (మే 18, సోమవారం నాటికి) కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మాత్రమే ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

రుపే కార్డ్ హోల్డర్లకు ముందస్తు అవకాశం..
మ్యాచ్యులను స్టేడియంలో చూడాలనుకునే అభిమానుల కోసం బీసీసీఐ ప్రత్యేక విండోలను ఏర్పాటు చేసింది. ఎప్పటిలాగే రుపే క్రెడిట్ కార్డ్ కలిగిన వినియోగదారులకు సాధారణ ప్రజల కంటే 24 గంటల ముందే టిక్కెట్లు కొనుగోలు చేసే ప్రత్యేక అర్హత లభిస్తుంది.

క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్: ఈ రెండు మ్యాచ్‌ల ముందస్తు బుకింగ్స్ మే 20, రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. మే 26న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో క్వాలిఫైయర్-1 జరగనుండగా.. మే 27న న్యూ చండీగఢ్‌లోని కొత్త పీసీఏ (PCA) స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.

క్వాలిఫైయర్ 2, ఫైనల్: ఈ మ్యాచ్‌ల కోసం రుపే కార్డ్ హోల్డర్ల ప్రత్యేక బుకింగ్ విండో మే 22, రాత్రి 7 గంటలకు ఓపెన్ అవుతుంది. క్వాలిఫైయర్-2 మ్యాచ్ మే 29న న్యూ చండీగఢ్‌లో, అలాగే ఐపీఎల్ 2026 ఫైనల్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

సాధారణ వినియోగదారుల టిక్కెట్లు.. 
ఎటువంటి ప్రత్యేక క్రెడిట్ కార్డులు లేని సాధారణ క్రికెట్ అభిమానుల కోసం కూడా బీసీసీఐ సమయాలను ఖరారు చేసింది. క్వాలిఫైయర్ 1 మరియు ఎలిమినేటర్ మ్యాచ్‌ల సాధారణ విక్రయాలు మే 21, రాత్రి 8 గంటల నుంచి అందుబాటులోకి వస్తాయి. క్వాలిఫైయర్ 2 , గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ల సాధారణ టిక్కెట్లు మే 23, రాత్రి 8 గంటల నుండి జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో అందరికీ అందుబాటులో ఉంచబడతాయి. మొత్తంగా ధర్మశాల, న్యూ చండీగఢ్, అహ్మదాబాద్ నగరాలు ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుండటంతో క్రికెట్ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి