NTV Telugu Site icon

RCB vs DC: ఆర్‌సీబీ చెత్త రికార్డు.. ఐపీఎల్‌ తొలి జట్టుగా!

Rcb Vs Dc

Rcb Vs Dc

ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓటమి చవిచూసింది. ఆర్‌సీబీ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ‘లోకల్ బాయ్‌’ కేఎల్ రాహుల్ (93 నాటౌట్‌; 53 బంతుల్లో 7×4, 6×6) బెంగళూరు పతనాన్ని శాసించాడు. 5 పరుగుల వద్ద రాహుల్‌ క్యాచ్‌ను కెప్టెన్‌ పాటీదార్‌ వదిలేయడంతో ఆర్‌సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది. మొదట బెంగళూరు 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఫిల్‌ సాల్ట్‌ (37; 17 బంతుల్లో 4×4, 3×6), టిమ్‌ డేవిడ్‌ (37; 20 బంతుల్లో 2×4, 4×6) మెరుపులు మెరిపించారు.

ఆర్‌సీబీకి హోం అడ్వాంటేజ్‌ ఏమాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఐదు మ్యాచ్‌లలో 3 విజయాలు సాధించగా.. అవన్నీ బయటి మైదానాల్లోనే కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్‌పై చిన్నస్వామి స్టేడియంలో ఓటమితో ఆర్‌సీబీ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఒకే వేదికపై అత్యధిక పరాజయాలు చవిచూసిన తొలి జట్టుగా బెంగళూరు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ఇప్పటివరకు 45 మ్యాచుల్లో ఓడింది.

అంతకుముందు ఈ చెత్త రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్‌ పేరిట ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ 44 మ్యాచ్‌ల్లో ఓడింది. డీసీ రికార్డు ఇప్పుడు బెంగళూరు బ్రేక్ చేసింది. ఈ జాబితాలో ఈడెన్ గార్డెన్స్‌లో 38 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ మూడవ స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్‌-18 టైటిల్ దిశగా సాగుతున్న ఆర్‌సీబీకి డీసీ కళ్లెం వేసింది. మరోవైపు ఐపీఎల్ 2025లో డీసీ జోరు కొనసాగుతోంది. మిగతా జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా ఓడగా.. ఢిల్లీ మాత్రం అజేయంగా ఉంది.