Site icon NTV Telugu

PBKS vs RCB: అదే జరిగితే.. ఫైనల్‌కు పంజాబ్‌!

Pbks Vs Rcb

Pbks Vs Rcb

ఐపీఎల్‌ 2025లో పంజాబ్‌ కింగ్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పంజాబ్‌, బెంగళూరు జట్లు క్వాలిఫయర్‌ 1లో తలపడతాయి. పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న గుజరాత్‌, ముంబై టీమ్స్ ఎలిమినేటర్‌లో ఢీకొంటాయి. క్వాలిఫయర్‌ 1లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌ 2 రూపంలో (ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మ్యాచ్) మరో అవకాశం ఉంటుంది.

నేడు ముల్లాన్‌పుర్‌లో తొలి క్వాలిఫయర్‌ పంజాబ్‌ కింగ్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య రాతి 7.30కు ఆరంభం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం క్వాలిఫయర్‌ 1కు రిజర్వ్‌ డే లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఏ కారణంగా అయినా రద్దైతే.. పంజాబ్‌ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. అందుకు కారణం పాయింట్ల పట్టికలో పంజాబ్‌ అగ్రస్థానంలో ఉండడమే. లీగ్ దశలో పంజాబ్‌, బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో చెరో 9 విజయాలు సాధించి.. పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్లకు పాయింట్లు సమంగా ఉన్నా.. బెంగళూరుతో పోలిస్తే పంజాబ్‌కు నెట్‌ రన్‌రేట్‌ ఎక్కువగా ఉంది. అయితే క్వాలిఫయర్‌ 1కు ఎలాంటి వర్షం ముప్పు లేదని సమాచారం.

Also Read: Mahanadu 2025: నేడు మూడోరోజు టీడీపీ మహానాడు.. 5 లక్షల మందితో బహిరంగ సభ!

ఐపీఎల్ 2025లో పంజాబ్‌, బెంగళూరు టీమ్స్ రెండు సార్లు తలపడగా.. చెరోసారి గెలిచాయి. ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య 35 మ్యాచ్‌లు జరగగా.. పంజాబ్‌ 18, బెంగళూరు 17 గెలిచింది. ఇక ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ముల్లాన్‌పుర్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. తొలి రెండు మ్యాచ్‌లో 200 ప్లస్ స్కోర్లు నమోదు కాగా.. చివరి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం తక్కువ స్కోర్లు వచ్చాయి. దాంతో ఈరోజు పిచ్‌ ఎలా ఉండబోతుందున్నది ఆసక్తికరంగా మారింది. బెంగళూరు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండగా.. పంజాబ్ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది.

Exit mobile version