NTV Telugu Site icon

Shreyas Iyer: నాకు మంచి ఊపొచ్చింది.. ఈ జోరును కొనసాగిస్తాం!

Shreyas Iyer Pbks

Shreyas Iyer Pbks

సీజన్ తొలి మ్యాచులోనే 97 పరుగులతో నాటౌట్‌గా నిలవడం తమకు మరింత కలిసొచ్చే అంశం అని పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ తెలిపాడు. శశాంక్ సింగ్ అద్భుతంగా ఆడాడని, 16 బంతుల్లో 44 రన్స్ చేయడం జట్టుకు కీలకంగా మారాయన్నాడు. ఒత్తిడిలో కూడా విజయ్ కుమార్ వైశాక్ ప్రశాంతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. సీజన్ ప్రారంభానికి ముందే అన్ని విధాలుగా సిద్ధమయ్యామని, ఇదే జోరును మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాం అని శ్రేయస్‌ చెప్పాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో 11 పరుగుల తేడాతో గెలిచింది.

మ్యాచ్ అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ మాట్లాడుతూ… ‘సీజన్ తొలి మ్యాచ్‌లో 97 పరుగులతో నాటౌట్‌గా నిలవడం మాకు కలిసొచ్చే అంశం. నేను ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ బాదడం మంచి ఊపొచ్చింది. కాగిసో రబాడ బౌలింగ్‌లో ఫ్లిక్ సిక్స్ కూడా చాలా ప్రత్యేకం. శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేయడం జట్టుకు చాలా కీలకంగా మారింది. మేము దూకుడుగా ఆడేందుకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నాం. మంచు కురుస్తున్న కొద్దీ పరిస్థితులు వేగంగా మారతాయి. అయినా వైశాక్ అద్భుతంగా రాణించాడు. రాగానే యార్కర్లు వేశాడు. ఒత్తిడిలో కూడా చాలా ప్రశాంతంగా బౌలింగ్ చేశాడు’ అని ప్రశంసించాడు.

Also Read: 2032 Olympics: 2032 ఒలింపిక్స్‌ తర్వాత ప్రతిష్టాత్మక క్రికెట్‌ స్టేడియం కూల్చివేత!

‘వైడ్ యార్కర్ ప్రణాళికలో అర్ష్‌దీప్ సింగ్ ముఖ్య పాత్ర పోషించాడు. బంతి కొంచెం రివర్స్ అవుతుందని అర్ష్‌దీప్ చెప్పాడు. దాంతో బంతిపై లాలాజలం పూయడంతో బౌలర్లకు కొంత సహాయపడుతుందని నేను భావించాను. సాయిని అర్ష్‌దీప్ ఔట్ చేయడంతో మ్యాచ్ టర్న్ అయింది. వైడ్ యార్కర్లను లేట్ చేయకుండా ముందుగానే ప్రారంభిద్దాం అని చెప్పాడు. సీజన్ ప్రారంభానికి ముందు మేము అన్ని విధాలుగా సిద్దమయ్యాం. మా సమావేశాలలో మైదానంలో మనం ఏమి చేయగలమో దాని గురించి చర్చించాం. ఇదే ఊపును మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాం’ అని శ్రేయస్‌ అయ్యర్ తెలిపాడు.