NTV Telugu Site icon

RCB vs GT: విజృంభించిన సిరాజ్, దంచేసిన బట్లర్‌.. ఆర్సీబీపై గుజరాత్‌ ఘన విజయం!

Siraj, Buttler

Siraj, Buttler

ఐపీఎల్‌ 2025లో గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్‌ (73 నాటౌట్‌; 39 బంతుల్లో 5×4, 6×6) హాఫ్ సెంచరీ చేయగా.. సాయి సుదర్శన్‌ (49; 36 బంతుల్లో 7×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బెంగళూరు 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. లివింగ్‌స్టన్‌ (54; 40 బంతుల్లో 1×4, 5×6) హాఫ్ సెంచరీ చేశాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆరంభం దక్కలేదు. సిరాజ్‌ చెలరేగడంతో బెంగళూరు 7 ఓవర్లలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ (7)ని అర్షద్‌ ఖాన్‌ అవుట్ చేయగా.. పడిక్కల్‌ (4), ఫిల్‌ సాల్ట్‌ (14)ను సిరాజ్ పెవిలియన్‌ చేర్చాడు. రజత్‌ పాటిదార్‌ (12)ను ఇషాంత్‌ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ సమయంలో లివింగ్‌స్టన్, జితేశ్‌ శర్మ (33; 21 బంతుల్లో 5×4, 1×6) జట్టును ఆదుకున్నారు. 12 ఓవర్లలో 91/4తో ఆర్సీబీ కోలుకుంది. స్పిన్నర్‌ సాయికిశోర్‌ వరుస ఓవర్లలో జితేశ్‌, కృనాల్‌ను వెనక్కి పంపాడు. టిమ్‌ డేవిడ్‌ (32; 18 బంతుల్లో 3×4, 2×6) రెచ్చిపోవడంతో చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ 64 పరుగులు పిండుకుంది. సిరాజ్‌ (3/19), సాయికిశోర్‌ (2/22) రాణించారు.

ఛేదనలో గిల్‌ (14) త్వరగానే అవుట్ అయినా సాయి సుదర్శన్‌ నిలిచాడు. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ జోస్ బట్లర్‌కు అండగా నిలిచాడు. బట్లర్‌ రెచ్చిపోవడంతో గుజరాత్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 13వ ఓవర్లో సుదర్శన్‌ను హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేయడంతో.. 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రూథర్‌ఫర్డ్‌ (30 నాటౌట్‌; 18 బంతుల్లో 1×4, 3×6)తో కలిసి బట్లర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివరి 3 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సివుండగా.. ఈ ఇద్దరు సిక్స్‌లు బాదేసి మ్యాచ్‌ను ముగించారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.