Site icon NTV Telugu

SRH vs GT: సన్‌రైజర్స్‌ పరాజయాల పరంపర.. గుజరాత్‌ హ్యాట్రిక్‌ విజయం!

Gt

Gt

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపై కూడా తేలిపోతున్న ఎస్‌ఆర్‌హెచ్‌.. వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయింది. ఐపీఎల్ 2025లో ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్లేఆఫ్స్‌ రేసులో ప్రతి గేమ్ కీలకంగా మారింది. మరో 2-3 ఓటములు ఎదురైతే ప్లేఆఫ్స్‌ ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన గుజరాత్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ (4/17) దెబ్బకు 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులే చేసింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (31; 34 బంతుల్లో 3×4) టాప్‌ స్కోరర్‌. ట్రావిస్‌ హెడ్‌ (8), అభిషేక్‌ శర్మ (18; 16 బంతుల్లో 4×4), ఇషాన్‌ కిషన్‌ (17; 14 బంతుల్లో 2×4) త్వరగానే అవుట్ అయ్యారు. ఆపై గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 10 ఓవర్లలో 3 వికెట్లకు 64 పరుగులే చేసింది. హెన్రిచ్ క్లాసెన్‌ (27; 19 బంతుల్లో 2×4, 1×6) కూడా భారీ షాట్లు ఆడలేక ఇబ్బంది పడ్డాడు. 19వ ఓవర్లో అనికేత్‌వర్మ (18; 14 బంతుల్లో 2×4), సిమర్‌జీత్‌ సింగ్‌ (0)లను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. అయితే ఇషాంత్‌ శర్మ వేసిన చివరి ఓవర్లో ప్యాట్ కమిన్స్‌ (22 నాటౌట్‌; 9 బంతుల్లో 3×4, 1×6) చెలరేగడంతో సన్‌రైజర్స్‌ 150 పరుగుల మార్కును దాటింది.

153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. సాయి సుదర్శన్‌ (5), జోస్ బట్లర్‌ (0) త్వరగానే అవుట్ అయ్యారు. 4 ఓవర్లలో 17/2తో కష్టాల్లో పడింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ (49; 29 బంతుల్లో 5×4, 2×6) రెచ్చిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్‌ గమనాన్నే మార్చేశాడు. దాంతో పవర్‌ ప్లే ముగిసేసరికి గుజరాత్‌ 48/2తో నిలిచింది. శుభ్‌మన్‌ గిల్‌ (61 నాటౌట్‌; 43 బంతుల్లో 9×4) కూడా జోరందుకోవడంతో గుజరాత్‌ లక్ష్యం దిశగా నడిచింది. ఇద్దరు మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించి గుజరాత్‌ను మెరుగైన స్థితికి చేర్చాడు. సుందర్ అవుట్ అయ్యాక రూథర్‌ఫర్డ్‌ (35 నాటౌట్‌; 16 బంతుల్లో 6×4. 1×6), ఫీల్ కలిసి మిగతా పని పూర్తి చేశారు. 16.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన గుజరాత్ హ్యాట్రిక్‌ విజయం ఖాతాలో వేసుకుంది.

Exit mobile version