ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ మరో రికార్డు నెలకొల్పింది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఇప్పటివరకు ముంబై 10 విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతాపై విజయం సాధించడంతో ముంబై ఖాతాలో ఈ రికార్డు చేరింది.
ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉంది. ఈడెన్ గార్డెన్ వేదికగా పంజాబ్ కింగ్స్‌పై అత్యధికంగా కోల్‌కతా 9 విజయాలు నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో పంజాబ్‌పై 8 విజయాలు సాధించింది. వాంఖడేలో ఆర్సీబీపై ముంబై, బెంగళూరులో ఆర్సీబీపై ముంబై, చెన్నైలో ఆర్సీబీపై సీఎస్కే, కోల్‌కతాలో ఢిల్లీపై కేకేఆర్ కూడా 8 విజయాలు నమోదు చేశాయి. ఇక మొత్తంగా కేకేఆర్‌పై 24 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందింది. కేకేఆర్‌పై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ముంబై అగ్ర స్థానంలో ఉంది.