ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ (97) మిస్ అయింది. మూడో స్థానంలో దిగిన శ్రేయస్.. ఫోర్లు, సిక్సులతో చెలరేగి 17 ఓవర్ పూర్తయ్యేసరికే 90 రన్స్ చేశాడు. అప్పటికి ఇంకా 3 ఓవర్లు ఉండడంతో శ్రేయస్ సెంచరీ లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే చివరి 3 ఓవర్లలో 4 బంతులను మాత్రమే ఆడాడు. శశాంక్ సింగ్ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోవడంతో.. శ్రేయస్ సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తనకు స్ట్రైకింగ్ రాకపోయినా ఫర్వాలేదు, వేగంగా ఆడాలని శ్రేయస్ తనకు చెప్పినట్లు మ్యాచ్ అనంతరం మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో శశాంక్ చెప్పాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మ్యాచ్ అనంతరం శశాంక్ సింగ్‌తో కామెంటేటర్ రవిశాస్త్రి మాట్లాడారు. శశాంక్ మాట్లాడుతూ… ‘నిజాయతీగా చెప్పాలంటే.. నేను క్రీజులోకి రాగానే శ్రేయస్ అయ్యర్ నాకు ఒకటే మాట చెప్పాడు. ‘శశాంక్.. నా సెంచరీ గురించి ఆలోచించకుండా దూకుడుగా ఆడు. సెంచరీ కంటే టీమ్ స్కోర్ ముఖ్యం. నీ తరహాలో షాట్లు ఆడేసేయ్’ అన్నాడు. ఆ మాటలు నాలో ఎంతో స్ఫూర్తినిచ్చాయి. శ్రేయస్ అలా చెప్పడంతో వేగంగా ఆడేందుకు ప్రయత్నించా’ అని చెప్పాడు. వెంటనే రవిశాస్త్రి మాట్లాడుతూ.. అది సరైన నిర్ణయం అని, టీమ్ గేమ్‌లో ఇలానే ఉండాలన్నారు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడకూడదని చెప్పుకొచ్చారు. రవిశాస్త్రి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. రవిశాస్త్రి వ్యాఖ్యలు విరాట్ కోహ్లీని ఉద్దేశించి అన్నవేనా? అని నెటిజెన్స్ అంటున్నారు.
Also Read: Miami Open 2025: టెన్నిస్ క్రీడాకారిణికి వేధింపులు.. అదనపు భద్రత కేటాయింపు!
ఐపీఎల్ 2019లో కోల్‌కతా మ్యాచ్ సందర్భంగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో పరుగు కోసం ప్రయత్నించలేదు. మార్కస్ స్టాయినిస్ బంతిని బాదగా .. సింగిల్ చాలని కోహ్లీ అతడిని ఆపేశాడు. అప్పటికి కోహ్లీ 96 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. చివరి బంతికి బౌండరీతో విరాట్ సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ తన సెంచరీ కోసమే రెండో పరుగు తీయలేదు. వన్డే ప్రపంచకప్ 2023లోనూ బంగ్లాదేశ్‌పై సెంచరీకే ప్రాధాన్యం ఇచ్చాడు. దాంతో రవిశాస్త్రి కామెంట్స్ కోహ్లీని ఉద్దేశించేనా? అని నెట్టింట చర్చ జరుగుతోంది.