NTV Telugu Site icon

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. స్టార్ ప్లేయర్‌పై రెండేళ్ల నిషేధం!

Delhi Capitals

Delhi Capitals

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2025 కోసం సిద్దమవుతున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఇంగ్లండ్ స్టార్‌​ బ్యాటర్‌ ​హ్యారీ బ్రూక్ జట్టుకు దూరం అయ్యాడు.

ఐపీఎల్ 2025 నుంచి తాను తప్పుకుంటున్నట్లు హ్యారీ బ్రూక్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఇంగ్లండ్ తరఫున సిరీస్‌ల కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బ్రూక్ చెప్పాడు. ‘నేను చాలా కఠిన నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నా. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఢిల్లీ క్యాపిటల్స్, ఆ ప్రాంచైజీ అభిమానులను క్షమాపణలు కోరుతున్నాను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుండి నా దేశం తరపున ఆడాలని కలలు కన్నాను. నేను ఇష్టపడే ఆటను ఆడే అవకాశం ఇచ్చిన ఇంగ్లండ్‌కు కృతజ్ఞుడను’ అని హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Also Read: Rahul vs Axar: కేఎల్‌ రాహుల్ vs అక్షర్‌ పటేల్‌.. కెప్టెన్ ఎవరు?

హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొల‌గ‌డం ఇది రెండోసారి. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2024లో ఆడలేదు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఆ రూల్స్ ప్ర‌కారం.. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకోకూడదు. సరైన కారణం లేకుంటే.. సదరు ఆటగాడిపై రెండు సీజన్ల పాటు ఐపీఎల్ వేలంలో పాల్గొనకుండా నిషేధం విధించబడుతాడు. ఈ రూల్స్ ప్రకారం బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం పడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఓటమి నేపథ్యంలో జోస్ బ‌ట్ల‌ర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. బ‌ట్ల‌ర్ స్థానంలో బ్రూక్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. అందుకే బ్రూక్ ఐపీఎల్ 2025లో ఆడొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.