Site icon NTV Telugu

Virat Kohli-IPL 2024: ఆర్‌సీబీకి శుభవార్త.. ‘కింగ్’ కోహ్లీ వచ్చేస్తున్నాడు!

Virat Kohli Rcb

Virat Kohli Rcb

Virat Kohli To Join RCB Squad On March 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో 9 రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఆర్‌సీబీకి ఓ శుభవార్త. వ్యక్తిగత కారణాలతో గత రెండు నెలలుగా మైదానంలోకి దిగని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరో నాలుగు రోజుల్లో ఆర్‌సీబీ జట్టులో చేరనున్నాడు.

ప్రస్తుతం లండన్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ.. మార్చి 17న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది. మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని ఆర్‌సీబీ జెర్సీ రీవీల్‌ కార్యక్రమంలో విరాట్ పాల్గొననున్నాడట. 17వ సీజన్ కోసం ఇప్పటికే ఆర్‌సీబీ ప్లేయర్స్ అందరూ ట్రైనింగ్‌ క్యాంప్‌లో చేరారు. ఇటీవలే కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ సైతం జట్టుతో కలిశాడు. ఈ సారైనా కప్ సాధించాలని ఆర్‌సీబీ భావిస్తోంది. గత 16 సీజన్లలో బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని విషయం తెలిసిందే.

Also Read: WPL 2024: చరిత్ర సృష్టించిన ఎలీస్‌ పెర్రీ!

క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు రెండోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరి 15న లండన్‌లోని ఓ ఆసుపత్రిలో అనుష్క పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. తమ కుమారుడికి ‘అకాయ్‌’ అని నామకరణం చేసినట్లు విరాట్ తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ సిరీస్‌ మొత్తానికి కోహ్లీ దూరమయ్యాడు. మొదటి రెండు టెస్టులకు జట్టుకు ఎంపికైన విరాట్.. తొలి టెస్ట్ కోసం హైదరాబాద్ కూడా వచ్చాడు. అయితే వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. మూడో టెస్ట్ నుంచి జట్టుకు అందుబాటులో ఉంటాడనుకున్నా.. అది జరగలేదు.

Exit mobile version