NTV Telugu Site icon

Rishabh Pant: రిషబ్ పంత్‌ నుంచి ప్రేరణ పొందలేని వారు.. మనుషులే కాదు!

Rishabh Pant Batting

Rishabh Pant Batting

Shane Watson Lauds Rishabh Pant’s Batting in IPL 2024: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ నుంచి ప్రేరణ పొందలేని వారు నిజమైన మనుషులే కాదు అని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అన్నాడు. పంత్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం అని, అందులో ఎలాంటి అనుమానమే లేదన్నాడు. తీవ్ర గాయాల పాలైన పంత్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగలిగే సామర్థ్యం ఉందనుకోవడం నమ్మకశ్యం కానిదే అని వాట్సన్‌ పేర్కొన్నాడు. ఏడాదిన్నర క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. కోలుకుని ఐపీఎల్ 2024లో ఆడుతున్న విషయం తెలిసిందే.

2022 చివరలో రిషబ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో అతడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలయిన పంత్‌కు శస్త్రచికిత్సలు జరిగాయి. పంత్‌ను మళ్లీ మైదానంలో చూడగలమా?, మునుపటిలా ఆడగలడా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపించాయి. కానీ సంకల్ప బలంతో నిలబడ్డ పంత్‌.. మైదానంలోకి తిరిగొచ్చాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేసి ఒకప్పటిలా బ్యాటింగ్ చేస్తున్నాడు.

Also Read: Mumbai Indians Record: ముంబై ఇండియన్స్‌ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి జట్టు!

ఐపీఎల్ 2024లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో రిషబ్‌ పంత్‌ పర్వాలేదనిపించాడు. పంజాబ్ కింగ్స్‌పై 18 రన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై 28 పరుగులు చేశాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 51 రన్స్ చేశాడు. పంత్ బ్యాటింగ్ చూసిన షేన్‌ వాట్సన్‌ ఫిదా అయ్యాడు. ‘రిషబ్ పంత్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం. అందులో ఎలాంటి అనుమానమే లేదు. తీవ్ర గాయాల పాలైన పంత్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగలిగే సామర్థ్యం ఉందనుకోవడం నమ్మకశ్యం కానిదే. పంత్‌ నుంచి ప్రేరణ పొందలేని వారు.. మనుషులే కాదు. లయ అందుకునేందుకు అతడికి కొంచెం సమయం పట్టింది. ఒక్కసారి లయ అందుకున్నాక తనదైన శైలిలో షాట్లు ఆడాడు’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు.