NTV Telugu Site icon

MS Dhoni-IPL 2024: ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్‌.. మోకాళ్లు అరిగిపోతున్నప్పటికీ..!

Ms Dhoni Csk

Ms Dhoni Csk

Robin Uthappa on MS Dhoni IPL Retirement: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) 2024 మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఇటీవలే చెన్నైలో అడుగుపెట్టిన సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ప్రాక్టీస్‌ ముమ్మరం చేశాడు.సీఎస్‌కేను ఆరోసారి విజేతగా నిలపాలని చూస్తున్నాడు. అయితే ఎప్పటిలానే మహీకి ఇదే చివరి సీజన్‌ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓ చర్చా కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు స్పందించారు.

మోకాళ్లు అరిగిపోతున్నప్పటికీ ఎంఎస్ ధోనీ వికెట్ కీపింగ్ చేయడానికి ఇష్టపడుతాడని ఇయాన్‌ మోర్గాన్, రాబిన్ ఉతప్ప అన్నారు. ‘ఎంఎస్ ధోనీ రిటైర్‌మెంట్‌ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. గత 2-3 ఏళ్లుగా రిటైర్‌మెంట్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. ధోనీ స్క్రిప్ట్‌ను అతడే రాసుకునే వైవిధ్యభరితమైన క్రికెటర్. అతడి మోకాలు ఇబ్బంది పెట్టినా.. ధోనీ మాత్రం తన స్థానాన్ని వదిలిపెట్టడు. సీఎస్‌కేను విజయవంతంగా నడిపించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఎవరైనా బాధ్యతలు తీసుకునే వరకూ జట్టుతో పాటే ఉంటాడు’ అని మోర్గాన్ అన్నాడు.

Also Read: Rohit Sharma-IPL 2024: బాధ్యతలు లేవు.. ఐపీఎల్ 2024లో రోహిత్‌ శర్మ రెచ్చిపోతాడా?

‘ఎంఎస్ ధోనీకి ఆట పట్ల మక్కువ ఎక్కువ. జట్టును గెలిపించేందుకు ఎప్పుడూ కష్టపడుతుంటాడు. సీఎస్‌కేతో అతడికి మంచి అనుబంధం ఉంది. ఒకవేళ ధోనీ వీల్‌ఛైర్‌లో ఉన్నా సరే చెన్నై అతడికి ఆడేందుకు అవకాశం ఇస్తుంది. బ్యాటింగ్‌లో అతడికి సమస్యేమీ లేదు. కీపింగ్‌లోనే ఏదైనా ఇబ్బంది ఎదురు కావచ్చు. మోకాళ్లు అరిగిపోతున్నప్పటికీ.. కీపింగ్‌ చేయడమంటే ధోనీకి చాలా ఇష్టం’ అని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ధోనీ 250 ఐపీఎల్ మ్యాచులు ఆడి 5082 రన్స్ చేశాడు.