NTV Telugu Site icon

MS Dhoni: ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు!

Ms Dhoni

Ms Dhoni

Mohammed Shami Heap Praise on MS Dhoni Captaincy: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు అని భారత సీనియర్ పేసర్‌ మహ్మద్‌ షమీ అన్నాడు. ప్రతి కెప్టెన్‌ మైండ్‌సెట్ పూర్తి భిన్నంగా ఉంటుందని, మహీలా ఏడో స్థానంలో వచ్చి మ్యాచ్‌ను ముగించడం అందరికీ సాధ్యం కాదన్నాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. తొలుత గెలిచేలా కనిపించిన ముంబైగా.. అనూహ్యంగా వికెట్లు కోల్పోయి ఓడిపోయింది. కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా తీసుకున్న పలు నిర్ణయాలపై అభిమానులతో పాటు కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మహ్మద్‌ షమీ కూడా హార్దిక్‌ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘ఎంఎస్ ధోనీ ఎప్పటికీ ధోనీనే. మహీకి ఎవరూ సరితూగరు. ప్రతి ఒక్కరికి భిన్నమైన మనస్తత్వం ఉంటుంది. ధోనీ అయినా విరాట్ కోహ్లీ అయినా రోహిత్ శర్మ అయినా.. అందరి ఆలోచనా ధోరణి వేరు. నైపుణ్యాన్ని బట్టి ఆటలో కొనసాగాలి. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరఫున హార్దిక్‌ పాండ్యా మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. కెరీర్‌లో చాలాసార్లు ఐదో స్థానంలో ఆడాడు. ఐపీఎల్ 2024లో ముంబై తరఫున ఏడో స్థానంలో ఎందుకు వచ్చాడు?. ఇలా చేయడం వల్ల హార్దిక్ దాదాపు టెయిలెండర్‌లాగా కనిపిస్తున్నాడు. ఏడో స్థానంలో వస్తే మీపై మీరే ఒత్తిడి పెంచుకున్నట్లవుతుంది. ఒకవేళ హార్దిక్ ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్‌ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు’ అని మహ్మద్‌ షమీ పేర్కొన్నాడు.

Also Read: RCB vs PBKS: బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్.. పంజాబ్ పై బెంగళూరు గెలుపు

ఇటీవల చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న మహ్మద్‌ షమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గాయం కారణంగా షమీ ఐపీఎల్ 2024కు దూరమయ్యాడు. వన్డే ప్రపంచకప్ 2023లో గాయపడిన షమీ ఆపై ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న షమీకి టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువ.