Rishabh Pant Likely To Play IPL 2024: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పునరాగమనంపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో పంత్ పునరాగమనం చేయనున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వైద్య బృందం పంత్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ఎన్‌సీఏ పేర్కొంది.
రిషబ్ పంత్ త్వరలోనే విశాఖలో జరిగే ప్రీక్యాంప్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలువనున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ రెండు మ్యాచ్‌లను విశాఖలో ఆడనుంది. మార్చి 23న మొహాలీలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఢిల్లీ తమ ఐపీఎల్ 17వ సీజన్‌ను ప్రారంభించనుంది. గత సీజన్‌లో పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్ ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. వార్నర్ సారథ్యంలో ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. 14 మ్యాచులో కేవలం ఐదు విజయాలు సాధించిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
Also Read: Airtel Recharge: ఎయిర్‌టెల్ యూజర్‌లకు షాక్.. పెరిగిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు!
2022 డిసెంబర్ మాసంలో రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. కారు యాక్సిడెంట్‌లో మృత్యుంజయుడిగా బయటపడిన పంత్.. మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం ఎన్‌సీఏలో పునరావాసం పొందాడు. ఎన్‌సీఏ వైద్య బృందం సమక్షంలో కఠినమైన వ్యాయామాలు చేసి ఫిట్‌నెస్ సాధించాడు. ప్రస్తతం ఎన్‌సీఏలో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పంత్ ఫిట్‌నెస్ సాధించినా.. ఐపీఎల్ 2024లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడనున్నాడు. అతడిపై ఎక్కువ భారం పడకుండా కీపింగ్ బాధ్యతలు వేరేవాళ్లకు అప్పగించే చాన్స్ ఉంది.