Hardik Pandya Trading ahead of IPL 2024: సరిగ్గా ఆడని ఆటగాళ్లను వేలంలో వదిలేయడం, కొత్త వారిని కొనుక్కోవడం ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఫ్రాంచైజీలు చేస్తుంటాయి. అలానే ట్రేడింగ్ విధానం ద్వారా ఆటగాళ్లను బదిలీ చేసుకోవడం కూడా మామూలే. అయితే కెప్టెన్‌ను వదులుకోవడం మాత్రం చాలా అరుదుఅనే చెప్పాలి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీ ఇదే చేస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు ట్రేడింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ను ట్రేడింగ్ చేయడం ఇదే మొదటిసారి మాత్రం కాదు.
కెప్టెన్‌ను వద్ధులుకున్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌లు ఉన్నాయి. 2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ ప్రక్రియలో దక్కించుకుంది. 2019లో రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. 2020 సీజన్‌లో వీరిద్దరూ సారథిగా కాకుండా.. ఆటగాళ్లుగా ఆడారు. అప్పుడు ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించాడు. 2020 సీజన్‌లో ఢిల్లీ ఐపీఎల్ ఫైనల్‌కు చేరి.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.
ఐపీఎల్ 2024 వేలానికి ముందు అన్ని జట్లు అట్టిపెట్టుకునే, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడానికి సిద్దమయ్యాయి. నవంబర్ 26 సాయంత్రం నాటికి 10 ఫ్రాంచైజీలు ఆ వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. ఈసారి వేలానికి ముందే అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం హార్ధిక్ పాండ్యా ట్రేడ్. గుజరాత్ టైటాన్స్ యాజమన్యంతో విభేదాల కారణంగానే హార్దిక్ తిరిగి ముంబై ఇండియన్స్‌కు చేరుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.