Mallika Sagar is the IPL 2024 Auctioneer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో కాసుల పంట పండించే సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం మంగళవారం (డిసెంబర్ 19) జరగనుంది. దుబాయ్‌లోని కోకా-కోలా ఏరేనా హోటల్‌లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు వేలం ఆరంభం కానుంది. ఈ వేలంలో దేశ, విదేశీ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే వేలానికి ముందే మల్లికా సాగర్ చరిత్ర సృష్టించారు.
పురుషుల ఐపీఎల్ వేలంలో తొలి మహిళా ఆక్షనీర్‌గా మల్లికా సాగర్ రికార్డుల్లో నిలిచారు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళా ఆక్షనీర్‌గా లేరు. ఐపీఎల్ వేలంలో తొలి మహిళ ఆక్షనీర్ మల్లికానే. 2008 నుంచి 2018 వరకు రిచర్డ్ మాడ్లీ ఆక్షనీర్‌గా ఉన్నారు. దశాబ్ద కాలం పాటు మాడ్లీ ఆక్షన్ నిర్వహించాడు. 2018 నుంచి హ్యు ఎడ్మిడ్స్ ఆక్షనీర్ బాధ్యతలు అందుకున్నాడు. అయితే 2022 వేలం మధ్యలో ఎడ్మిడ్స్ అనారోగ్యానికి గురయ్యాడు. చారు శర్మ ఆ వేలాన్ని కొనసాగించాడు. దాంతో ఐపీఎల్ వేలానికి ఆక్షనీర్‌గా పనిచేసిన తొలి భారతీయుడిగా చారు రికార్డుల్లో నిలిచాడు. ఇప్పుడు మల్లికా సాగర్ తొలి మహిళా ఆక్షనీర్‌గా రికార్డు నెలకొల్పారు.
Also Read: IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలం డేట్, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
48 ఏళ్ల మల్లికా సాగర్ ముంబైకి చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్. మల్లికాకు వేలంలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్ చాతుర్యంతో అందరిని అకట్టుకున్నారు. ఆ తర్వాత డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ (డబ్ల్యూపీఎల్ 2023)కు సంబంధించిన వేలాన్ని మల్లికానే నిర్వహించారు. అనంతరం ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలం, డబ్ల్యూపీఎల్ 2024 వేలం నిర్వహించారు. ఇప్పుడు ఐపీఎల్ 2024 వేలంను నిర్వహించేందుకు మల్లికా సిద్ధంగా ఉన్నారు.