NTV Telugu Site icon

India Women: మరో సంచలనం సృష్టించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు!

India Women Test

India Women Test

India defeated Australia for the first time in Women’s Test History: ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్ట్‌ విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు.. మరో సంచలనం నెలకొల్పింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది. భారత మహిళలకు ఆస్ట్రేలియా జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. దాంతో భారత ప్లేయర్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

భారత్‌తో ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. డిసెంబరు 21న మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. సొంతగడ్డపై చెలరేగిన భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 219 పరుగులకే ఆలౌట్ చేశారు. తహ్లియా మెక్‌గ్రాత్ (50) టాప్ స్కోరర్. పూజా వస్త్రాకర్‌ 4, స్నేహ్‌ రాణా 3 , దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. ఆపై భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌట్‌ అయి భారీ ఆధిక్యంలో నిలిచింది. స్మృతి మంధాన (74), జెమీమా రోడ్రిగ్స్‌ (73), రిచా ఘోష్‌ (52), దీప్తి శర్మ (78) హాఫ్ సెంచరీలు చేశారు.

Also Read: KTR: ‘శ్వేతపత్రం’ తప్పుల తడక.. కాంగ్రెస్ ప్రభుత్వం మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది: కేటీఆర్‌

రెండో ఇన్నింగ్స్‌లో తిరిగి పుంజుకోవాలని చూసిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించిన ఆసీస్.. నాలుగో రోజు మరో 28 పరుగులు చేసి 261 పరుగులకు ఆలౌట్ అయింది. స్నేహ్‌ రాణా 4 వికెట్లు పడగొట్టగా.. రాజేశ్వరి గైక్వాడ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రెండేసి వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్‌ను ముగించేసింది. స్మృతి మంధాన (38) సునాయాస విజయాన్ని అందించింది. ఇందకుముందు భారత్‌, ఆస్ట్రేలియా మహిళా జట్లు పది సార్లు పోటీపడగా.. ఆసీస్‌ నాలుగుసార్లు గెలిచింది. ఆరు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. చివరకు ఆస్ట్రేలియాపై టెస్టుల్లో భారత్ గెలిచింది.