NTV Telugu Site icon

Indus Appstore: గూగుల్‌ ప్లేకు పోటీగా.. ఇండస్‌ యాప్‌స్టోర్‌! ఇన్‌స్టాల్‌ ఎలా చేసుకోవాలంటే?

Indus Appstore

Indus Appstore

PhonePe Launches Indus Appstore in India: దేశీయ వినియోగదారుల కోసం ఓ కొత్త మొబైల్‌ అప్లికేషన్‌ (మొబైల్‌ యాప్‌) స్టోర్‌ వచ్చేసింది. వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్‌ పేమెంట్‌ సంస్థ ఫోన్‌పే.. ‘ఇండస్‌ యాప్‌స్టోర్‌’ను లాంచ్‌ చేసింది. దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేతుల మీదుగా ఈ యాప్‌ స్టోర్‌ ప్రారంభమైంది. ‘గూగుల్‌ ప్లే స్టోర్‌’కు పోటీగా ఇండస్‌ యాప్‌స్టోర్‌ వచ్చింది. ఈ ఆండ్రాయిడ్‌ ఆధారిత స్టోర్‌ను ‘ఇండియా కా యాప్‌ స్టోర్‌’గా ఫోన్‌పే పేర్కొంది.

ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్‌ రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా ఉంది. పెరుగుతున్న మొబైల్‌ వినియోగాన్ని మరింత వృద్ధి చేయాలనే ఆలోచనతో ఇండస్‌ యాప్‌స్టోర్‌ను ఫోన్‌పే లాంచ్‌ చేసింది. ఇది భారతీయ డిజిటల్‌ ప్రయాణంలో ఓ గొప్ప మార్పుగా ఫోన్‌పే పేర్కొంది. ఈ కొత్త యాప్‌ను వినియోగదారులు సమర్థవంతంగా వాడుకునేలా ఓ షార్ట్‌-వీడియోను సైతం ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 ప్రాంతీయ భాషల్లో ఈ యాప్‌స్టోర్‌ అందుబాటులో ఉంటుంది. నచ్చిన భాషలో సెర్చ్‌ చేసి యాప్స్‌ పొందొచ్చు. ఈ యాప్‌స్టోర్‌ వినియోగాన్ని పెంచేలా పలు స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలతోనూ భాగస్వామ్యానికి ఫోన్‌పే ప్రయత్నిస్తోంది.

45 కేటగిరీలకు చెందిన 2 లక్షల మొబైల్‌ అప్లికేషన్లను తమ యాప్‌స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఫోన్‌పే చెబుతోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేయడానికి 2025 ఏప్రిల్‌ 1 వరకు ఎలాంటి ఫీజూ ఉండదు. నచ్చిన థర్డ్‌ పార్టీ పేమెంట్‌ గేట్‌వేలు కూడా వాడుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ పాలసీలు, కమీషన్‌ విషయంలో స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఇండస్‌ యాప్‌స్టోర్‌ను లాంచ్ చేయడం గమనార్హం.

Also Read: Upcoming Smartphones 2024: అద్భుత ఫీచర్లతో.. త్వరలో లాంచ్ కానున్న టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

ప్రస్తుతం ఇండస్‌ యాప్‌స్టోర్‌ యాప్‌ కంపెనీ వెబ్‌సైట్‌ indusappstore.comలో అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌లో ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైల్‌ మేనేజర్‌లోకి వెళ్లి.. ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలి. పర్మిషన్లు ఓకే చేశాక యాప్‌ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అవుతుంది. మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా.. లాగిన్‌ అవ్వొచ్చు. అనంతరం మీకు నచ్చిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.