NTV Telugu Site icon

Flight: నిద్రలోకి జారుకున్న పైలట్లు.. ప్లైట్ మిస్సింగ్! తప్పిన ముప్పు!

Flite

Flite

విమానంలో ఇద్దరు పైలట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకేసారి ఇద్దరు నిద్ర పోవడంతో విమానం దారి తప్పింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఇద్దరిపై అధికారులు వేటు వేశారు.

దాదాపు అరగంట తర్వాత ప్రధాన పైలట్ మేల్కొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు ఇండోనేషియా రవాణా శాఖ తాజాగా వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు పైలట్లపై ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు పడింది.

బాతిక్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన ఓ విమానం నలుగురు సిబ్బంది, 153 మంది ప్రయాణికులతో సౌత్‌ ఈస్ట్‌ సులవేసి నుంచి దేశ రాజధాని జకర్తాకు పయనమైంది. కొద్దిసేపటికి కోపైలట్‌ అనుమతితో ప్రధాన పైలట్‌ నిద్రపోయాడు. విమానాన్ని నియంత్రణలోకి తీసుకున్న కోపైలట్‌ సైతం కూడా కొద్దిసేపటికే నిద్రలోకి జారుకున్నాడు. దీంతో వారిని సంప్రదించేందుకు జకర్తాలోని కంట్రోల్‌ సెంటర్‌ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్న 28 నిమిషాల తర్వాత మేల్కొన్న కెప్టెన్‌.. సహచర పైలట్‌ కూడా నిద్రపోతున్నాడని.. తాము నిర్ణీత మార్గంలో వెళ్లడం లేదని గుర్తించాడు. వెంటనే అతడిని నిద్ర లేపి, కంట్రోల్‌ సెంటర్‌ కాల్స్‌కు స్పందించాడు. ఈ క్రమంలోనే విమానాన్ని సరైన మార్గంలో పెట్టి.. జకర్తాలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

జనవరి 25న జరిగిన ఈ ఘటనను రవాణా శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని, స్థానికంగా అన్ని విమాన సేవల నిర్వహణ తీరును సమీక్షిస్తామని ఇండోనేషియా రవాణా శాఖ ప్రకటించింది.

ఇటీవల పలు దేశాల్లో విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనికి ప్రధానంగా పైలట్ల నిర్లక్ష్యమే కారణంగా జరుగుతున్నాయని నివేదికల్లో తేలుతున్నాయి. అయినా కూడా మొద్ద నిద్ర వీడడం లేదు. తాజా ఘటన తెలిసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లుగా వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక శుక్రవారం కూడా అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పింది. విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే టైరు ఊడి కిందపడింది. దీంతో పార్కింగ్‌లో ఉన్న కారు మీద పడడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.