NTV Telugu Site icon

Indiramma Atmiya Bharosa: శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల!

Indiramma Atmiya Bharosa

Indiramma Atmiya Bharosa

ఉపాధి కూలీలకు శుభవార్త. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు రిలీజ్ అయ్యాయి. వ్యవసాయ కూలిపని మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్న భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందన్న విషయం తెలిసిందే. వ్యవసాయ పట్టా భూమి ఉన్న రైతుల కుటుంబాలకు ఈ పథకం వర్తించదు. కుటుంబంలో ఎవరికి వ్యవసాయ భూమి ఉన్నా.. ఈ పథకానికి అనర్హులు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఒక్కో వ్యవసాయ కూలీ కుటుంబానికి రెండు విడతలుగా (ఒక్కో విడతకి రూ.6 వేలు) సంవత్సరానికి రూ.12 వేల ఆర్ధిక సహాయం అందుతుంది.

జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభం అయింది. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి.. కూలీల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ అయ్యాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు నిధులు విడుదలయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు నిధులను ప్రభుత్వం చెల్లించింది. 66,640 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమయ్యాయి.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ నిధులను ప్రభుత్వం చెల్లించనుంది. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్దదిక్కుగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి కూలీలకు ఆర్దిక చేయుత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక సీజన్‌కు రూ.6000 వేల చొప్పున కూలీలకు ప్రభుత్వం భరోసా ఇస్తోంది. డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తోంది.