Site icon NTV Telugu

India Reaction: ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం.. స్పందించిన భారత్

India Reaction

India Reaction

India Reaction: పాకిస్థాన్‌లో ర్యాలీలో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పులు జరపడంపై భారత్‌ స్పందించింది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. “ఈ ఘటన ఇప్పుడే జరిగింది.అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం.’అని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తెలిపారు. దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈరోజు జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిపిన కొద్ది క్షణాల తర్వాత, పాకిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ తెలిపింది. పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేపట్టిన ర్యాలీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాల్పుల్లో గాయపడగా.. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గురువారం వజీరాబాద్‌లో ‘నిజమైన స్వాతంత్య్రం’ ర్యాలీ సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్‌ఖాన్‌ కాలికి గాయమైంది. వజీరాబాద్‌లోని జఫరాలీ ఖాన్ చౌక్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఇమ్రాన్‌ ఖాన్‌ను కంటైనర్‌ నుంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలోకి మార్చారు. ఆయనతో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ కాల్పుల ఘటనలో ఆయన మేనేజర్‌ రషీద్‌, సింధ్ మాజీ గవర్నర్‌ ఇమ్మాన్‌ ఇస్మాయిల్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది.

Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు

పీటీఐకి చెందిన నేత ఫరూఖ్‌ అబీబ్‌ ఈ ఘటనలో ఇమ్రాన్‌ ఖాన్‌కు కూడా గాయాలైనట్టు ట్విటర్‌ వేదికగా తెలిపారు.ఈ కాల్పుల ఘటనపై పీటీఐ నేతలు మండిపడుతున్నారు. షెహబాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వజీరాబాద్‌లో జరిగిన కాల్పుల ఘటనపై పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి పర్వేజ్‌ ఇలాహి స్పందించారు. దీనిపై క్షుణ్నంగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని త్వరలోనే శిక్షించి.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు.

పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కంటెయినర్‌ వద్ద కాల్పుల ఘటనపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. వజీరాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై పంజాబ్‌ చీఫ్‌ సెక్రటరీ, ఐజీపీ నుంచి తక్షణమే నివేదిక కోరాలని పాక్‌ మంత్రి రాణా సనావుల్లాను ఆదేశించినట్టు ట్విటర్‌లో వెల్లడించారు. ఇమ్రాన్‌ఖాన్‌ సహా గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనకు సంబంధించి సెక్యూరిటీ, ఇన్వెస్టిగేషన్‌ విషయాల్లో పంజాబ్‌ ప్రభుత్వానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్నారు.

Exit mobile version