India-Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవులు వణికిపోతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో అక్కడ అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్జూ గెలిచిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం భారత వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. ఎన్నికల వాగ్దానాల్లో ఎక్కువగా భారత వ్యతిరేకతను ప్రదర్శించి మయిజ్జూ గెలిచారు. చైనాకు అత్యంత అనుకూలుడని ఇతనికి పేరుంది. ఇప్పటికే ఆ దేశంలో ఉన్న 77 మంది భారత సైనికులను మీ దేశం వెళ్లాల్సిందిగా ఆదేశించాడు.
అయితే, మాల్దీవుల లాగే బీచులు, అందమైన సముద్రానికి ప్రసిద్ధి చెందిన మనదేశంలోని లక్షద్వీపాల్లో టూరిజాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అక్కడికి వెళ్లడం మాల్దీవుల్లో కలవరాన్ని కలిగించింది. దీంతో ఇక అక్కడి నేతలు భారత్‌పై, భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విషం కక్కుతున్నారు. దీనిపై భారత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవిస్’’ పేరుతో ట్విట్టర్‌లో హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
మోడీ దెబ్బకు మాల్దీవుల్లో కంగారు:
మాల్దీవులు భారత్ దిగువన దక్షిణ-నైరుతి భాగంలో ఉండే ద్వీప దేశం. ఈ దేశం ఎక్కువగా తన అవసరాల కోసం భారత్‌పై ఆధారపడుతుంది. ముఖ్యంగా ఈ దేశ ఆదాయవనరు టూరిజం. ప్రతీ ఏడాది భారత్ నుంచే ఎక్కువగా టూరిస్టులు మాల్దీవులు వెళ్తుంటారు. అయితే, ఒక్కసారి లక్షద్వీపాల్లో టూరిజం అభివృద్ధి జరిగితే మాల్దీవుల ఆదాయం గణనీయంగా పడిపోతుందనే భయంతో అక్కడి నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం భారత అనుకూల వైఖరి అవలంభించేంది, అయితే ఇప్పుడున్న మయిజ్జూ ప్రభుత్వం చైనా అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ దెబ్బకొడితే ఆ దేశానికి బుద్ది వస్తోందో చూసి, అక్కడే దెబ్బ కొట్టారు పీఎం మోడీ. లక్షద్వీపాల్లో టూరిజం డెవలప్మెంట్ అయితే మాల్దీవులు ఇబ్బందుల్లో పడ్డట్లే. ఇది ఆ దేశానికి మింగుడుపడటం లేదు.
భారత్ నుంచే ఎక్కువ మంది టూరిస్టులు:
మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఆ దేశానికి వచ్చే టూరిస్టుల్లో ఇండియన్స్ అత్యధికం. డిసెంబర్ 13 వరకు ప్రపంచంలోని పలు దేశాల నుంచి మొత్తం 17, 57,939 మంది పర్యాటకులు ద్వీప దేశానికి వచ్చారు. ఇది 2022లో నమోదైన 15 లక్షల మంది కన్నా ఎక్కువ. మాల్దీవులను సందర్శించిన అత్యధిక పర్యాటకుల్లో భారతదేశం (2,09,198) మొదటిస్థానంలో ఉండగా.. రష్యా (2,09,146) మరియు చైనా (1,87,118) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
యునైటెడ్ కింగ్‌డమ్ నుండి సుమారు 1,55,730 మంది, జర్మనీ నుండి 1,18,412 మంది, ఇటలీ నుండి 1,18,412 మంది, యునైటెడ్ స్టేట్స్ నుండి 74,575 మంది, ఫ్రాన్స్ నుండి 49,199 మంది, స్పెయిన్ నుండి 40,462 మంది మరియు స్విట్జర్లాండ్ నుండి 37,260 మంది మాల్దీవులను పర్యాటకులు సందర్శించారు. ఆ దేశానికి ఎక్కువ విదేశీ మారక నిల్వల్ని భారతీయులే టూరిజం ద్వారా ఆర్జించి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో లక్షదీవుల్లో మోడీ పర్యటన ఆ దేశానికి కంటగింపుగా మారింది. ఒక్కసారి మాల్దీవులకు సమానంగా లక్షదీవులు డెవలప్ అయితే ఇతర విదేశీ టూరిస్టులు కూడా లక్షదీవులకు వచ్చే అవకాశం పెరుగుతుంది.