INS Mahendragiri: ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో ప్రాజెక్ట్ 17–ఏ ఫ్రిగేట్స్‌లో భాగంగా 7వ యుద్ధనౌక మహేంద్రగిరిని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్ చేతుల మీదుగా శుక్రవారం ముంబయి తీరంలో జలప్రవేశం చేయించారు. 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధనౌక నిర్మితమైంది. అధునాతన ఆయుధాలు, సెన్సార్‌లు, ఫ్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధనౌకగా ‘మహేంద్రగిరి’ రూపొందింది. భవిష్యత్‌లో భారతదేశం గొప్ప నావికా వారసత్వానికి చిహ్నంగా నిలవనుందని తయారీదారులు అభివర్ణించారు. తూర్పు కనుమల్లో భాగమైన, ఒడిశాలోని ‘మహేంద్రగిరి’ పర్వతం మీదుగా ఈ యుద్ధనౌకకు పేరు పెట్టడం గమనార్హం.
Also Read: Rahul Gandhi: విపక్షాలు ఏకమైతే బీజేపీ గెలవడం అసాధ్యం
ప్రాజెక్ట్–17ఏ కింద మొత్తం 4 నౌకలు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో నిర్మాణం చేపట్టగా.. మరో 3 నౌకలను జీఆర్‌ఎస్‌ఈ ద్వారా నిర్మిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ దృఢ నిబద్ధతకు అనుగుణంగా భారత నౌకాదళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో ద్వారా షిప్ అంతర్గత నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. దేశం గర్వించదగ్గ యుద్ధనౌకగా మహేంద్రగిరి రూపొందినట్టు ఇండియన్ నేవీ వర్గాలు తెలిపాయి. నౌకాదళంలో ఆత్మనిర్భరత దిశగా మన దేశం సాధించిన అద్భుతమైన పురోగతి ఈ యుద్ధనౌక నిదర్శనమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పాల్గొన్నారు.