Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం ఓ భారీ భూ ఆక్రమణల సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆక్రమణల తీవ్రత ఎంతలా ఉందంటే.. ఆ భూమితో ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం లాంటివి ఏకంగా 42 నిర్మించవచ్చు! లేదా దాదాపు 1,496 ఫిఫా (FIFA) స్టాండర్డ్ ఫుట్‌బాల్ మైదానాలను అందులో ఏర్పాటు చేయవచ్చట. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా రైల్వే బోర్డు వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా రైల్వే శాఖకు చెందిన 1,068.54 హెక్టార్ల భూమి ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. ఇండియన్ రైల్వేస్‌కు మొత్తం 4.99 లక్షల హెక్టార్ల భూమి ఉండగా, అందులో దాదాపు 0.21 శాతం భూమి ఇలా అక్రమార్కుల పాలైంది. మరీ ముఖ్యంగా ఈ సమస్య ఏమాత్రం తగ్గకపోగా, గడిచిన ఐదేళ్లలో అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 810.31 హెక్టార్లుగా ఉన్న రైల్వే ఆక్రమణల భూమి, 2024-25 నాటికి ఏకంగా 1,068.54 హెక్టార్లకు చేరింది. అంటే ఐదేళ్లలోనే దాదాపు 32 శాతం ఆక్రమణలు పెరిగాయి. ఈ ఐదేళ్ల కాలంలో 2021-22లో ఆక్రమణల విస్తీర్ణం 782.81 హెక్టార్లకు స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆ తర్వాతి ఏడాదే రికార్డు స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా 2023-24 నాటికి ఏకంగా 1,078.55 హెక్టార్లకు చేరింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 268 హెక్టార్ల భూమి అదనంగా ఆక్రమణలకు గురికావడం గమనార్హం.
మరోవైపు ఆక్రమణలను తొలగించి రైల్వే భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ మాత్రం చాలా నత్తనడకన సాగుతోంది. గడిచిన ఐదేళ్లలో రైల్వే శాఖ కేవలం 98.02 హెక్టార్ల భూమిని మాత్రమే ఆక్రమణదారుల నుంచి విడిపించగలిగింది. ఇప్పటికీ వెయ్యి హెక్టార్లకు పైగా భూమి ఆక్రమణల్లోనే మగ్గుతోంది. ఇలా స్వాధీనం చేసుకున్న భూములను రైల్వే శాఖ ఊరికే వదిలేయడం లేదు. రైల్వే లైన్ల విస్తరణ (మల్టీ ట్రాకింగ్ పనులు), వర్క్‌షాప్‌ల నిర్మాణం, ప్రయాణికుల టెర్మినల్స్, సరుకు రవాణా (ఫ్రైట్) టెర్మినల్స్ వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం వాడుతోంది. ప్రస్తుతానికి రైల్వే అవసరాలకు ఉపయోగపడదు అనుకున్న భూములను కమర్షియల్ డెవలప్‌మెంట్ కోసం ‘రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (RLDA) కి బదిలీ చేస్తోంది. అయితే ఈ ఆర్‌టీఐ సమాధానం ద్వారా రైల్వే బోర్డు డేటా నిర్వహణలోని లోపాలు కూడా బయటపడ్డాయి. రైల్వే భూముల ఆక్రమణలపై గత 25 ఏళ్ల హిస్టరీని ఇవ్వాలని కోరగా.. తమ వద్ద కేవలం ఐదేళ్ల రికార్డులు మాత్రమే అందుబాటులో ఉంటాయని బోర్డు చేతులెత్తేసింది. దీనర్థం దశాబ్దాలుగా రైల్వే భూములు ఎలా ఆక్రమణలకు గురవుతున్నాయనే దానికి సంబంధించిన దీర్ఘకాలిక కేంద్రీకృత రికార్డులేవీ రైల్వే బోర్డు వద్ద లేవు.

