Site icon NTV Telugu

Indian Railways: చిన్నారులకు టిక్కెట్‌పై రైల్వేశాఖ కీలక ప్రకటన

Indian Railways

Indian Railways

Indian Railways: రైళ్లలో ఐదేళ్లలోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలంటూ వస్తున్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. రైళ్లలో ప్రయాణించే చిన్నారుల టికెట్ బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు ప్రకటించింది. ఒకటి నుంచి ఐదేళ్ల వయస్సు గల పిల్లలకు పెద్దలకు వర్తించే టికెట్ ధరలు వర్తిస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలందరూ గతంలో తరహాలోనే రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించింది. అయితే ప్రత్యేకంగా బెర్త్ లేదా సీట్ కేటాయించడం ఉండదని స్పష్టం చేసింది. ఒకవేళ చిన్నారులకు బెర్త్ అవసరమైతే బెర్త్‌కు అయ్యే టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో పూర్తిగా పెద్దలకు వర్తించే టికెట్ ధర వర్తిస్తుంది.

Read Also: Focus on Cardiac Arrest Risk Live: ప్రాణాలు తీస్తున్న కార్డియాక్ అరెస్ట్..

ఏడాది వయస్సున్న పిల్లలు రైళ్లలో ప్రయాణిస్తే కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు వసూలు చేస్తోందని.. ప్రెగ్నెంట్ మహిళలకు అదనపు టికెట్ వసూలు చేయనందుకు బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వేలు ఇక పేదవాళ్లకు చెందవని.. ఇక బీజేపీకి ప్రజలు ఫుల్ టికెట్ కట్ చేస్తారని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ కూడా చేశారు. దీంతో ఈ ప్రచారం నిజమేనని చాలా మంది భావించారు. ఈ మేరకు రైల్వేశాఖ రంగంలోకి దిగి ఈ ప్రచారంపై స్పందించింది. ఈ వార్తలన్నీ తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని రైల్వేశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రయాణం పూర్తిగా ఉచితం అని.. ఒకవేళ ఐదేళ్లలోపు వయస్సు పిల్లలకు బెర్త్ అవసరమైతే బుక్ చేసుకునే అవకాశం ఉందని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

Exit mobile version