Australia: ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో దారుణానికి ఒడిగట్టిన భారత సంతతి మసాజ్ థెరపిస్ట్‌కు అక్కడి న్యాయస్థానం 13 ఏళ్ల 10 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఒక మసాజ్ పార్లర్‌లో ఏకంగా 61 మంది మహిళలపై లైంగిక వేధింపులకు, దోపిడీకి పాల్పడినందుకు గానూ అతనికి ఈ శిక్ష పడింది. అతని ప్రవర్తన నియంత్రణ లేనిది, దోపిడీపూరితంగా ఉందని న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు. స్థానిక వార్తా కథనాల ప్రకారం.. 39 ఏళ్ల సుమిత్ సతీష్ రస్తోగీ అనే వ్యక్తి అడిలైడ్ పశ్చిమ శివారు ప్రాంతమైన గ్లెనెల్గ్‌లోని ఒక మసాజ్ సెంటర్‌లో అక్టోబర్ 2021 నుంచి జూలై 2022 మధ్య కాలంలో ఈ ఘోరాలకు పాల్పడ్డాడు. మహిళలకు తెలియకుండా అసభ్యకరంగా ఫొటోలు తీయడంపై 55 నేరారోపణలు, తీవ్రమైన లైంగిక వేధింపులకు సంబంధించిన 42 నేరారోపణలతో కలిపి మొత్తం 97 నేరాలు నమోదయ్యాయి. ఈ నేరాలను కోర్టులో స్వయంగా అంగీకరించాడు. 2011లో ఢిల్లీ నుంచి అడిలైడ్‌కు వలస వెళ్లిన రస్తోగీని జూలై 2022లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ నేరాలు జరిగిన సమయంలో అతను ఎలాంటి అర్హత లేని సాధారణ మసాజ్ థెరపిస్ట్‌గా పనిచేస్తున్నట్లు కోర్టు విచారణలో తేలింది.
ఇక, గత శుక్రవారం జరిగిన సుమారు మూడు గంటల సుదీర్ఘ శిక్షా కాల విచారణలో, సౌత్ ఆస్ట్రేలియా డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి కార్మెన్ మాటియో తొమ్మిది నెలల పాటు జరిగిన ఈ నేరాల వివరాలను సుదీర్ఘంగా ప్రస్తావించారు. “నువ్వు వారి నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశావు, వారి పట్ల కనీస గౌరవం, మర్యాద లేకుండా ప్రవర్తించావు” అని న్యాయమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. రోజులు గడుస్తున్న కొద్దీ రస్తోగీలో ధైర్యం పెరిగి నేరాల తీవ్రత ఎక్కువైందని, ముఖ్యంగా బాధితుల అంతర్గత వస్త్రాలను తొలగించడం, రహస్యంగా వారి ప్రైవేట్ భాగాలను ఫోటోలు తీయడం వంటి పనులకు ఒడిగట్టాడని జడ్జి పేర్కొన్నారు. జూన్, జూలై 2022 నాటికి అతని ప్రవర్తన పూర్తిగా నియంత్రణ కోల్పోయిందని, పట్టుబడే వరకు అతను ఎక్కడా తగ్గినట్లు కనిపించలేదని వ్యాఖ్యానించారు. కనీస అర్హత లేకపోయినా అతను డబ్బులు తీసుకుంటూ మసాజ్ సేవలు అందించడం గమనార్హమని న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వేధింపుల వల్ల తాము ఎదుర్కొంటున్న మానసిక క్షోభను, కోల్పోయిన నమ్మకాన్ని పలువురు బాధితులు కోర్టు ముందు కన్నీళ్లతో వివరించారు. చివరికి రస్తోగీకి 13 ఏళ్ల 10 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇందులో కనీసం 10 ఏళ్ల 10 నెలల పాటు అతనికి ఎలాంటి పెరోల్ లభించదు. అతని అరెస్ట్ చేసిన నాటి నుండే ఈ శిక్షా కాలం వర్తిస్తుందని కోర్టు తేల్చి చెప్పింది.
