Site icon NTV Telugu

Nimisha Priya: యెమెన్ లో భారతీయ నర్సుకు ఉరి శిక్ష తేదీ ఖరారు.. నేరం ఏంటి..?

యెమెన్ జాతీయుడి హత్య కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు వచ్చే వారం జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. గత సంవత్సరం, కేరళకు చెందిన నిమిషా ప్రియకు యెమెన్ అధ్యక్షుడు మరణశిక్షను ఆమోదించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆమె కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఉరిశిక్ష పడిన ప్రియా క్షమాభిక్షను ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి గతంలో తిరస్కించారు. 2017 నుంచి యెమెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిమిష ప్రియాకు హత్య నేరానికి గాను 2018లో అక్కడి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. తలాల్ అబ్దో మహదీ అనే యెమెన్ పౌరుడి నుంచి తన పాస్‌పోర్ట్‌‌ను తీసుకునే క్రమంలో అతడికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి ప్రియా హత్యచేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ కేసులోనే ఆమెను దోషిగా నిర్దారించిన ట్రయల్ కోర్టు.. ఉరిశిక్ష ఖరారు చేసింది. దీనిపై ఆమె అక్కడ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. కింద కోర్టు తీర్పును సమర్దించింది. చివరకు క్షమాభిక్ష కోసం యెమెన్ అధ్యక్షుడికి ప్రియా పెట్టుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురయ్యింది.

READ MORE: FATF Report: పుల్వామా దాడి కోసం పేలుడు పదార్థాలను అమెజాన్‌లో కొన్నారు.. రిపోర్టులో సంచలన విషయాలు..

అసలు ఏం జరిగింది?
కోచిలో పలువురు ఇల్లలో పనికి వెళ్లే తన తల్లికి సాయంగా ఉండాలని నిర్ణయించుకున్న నిమిష ప్రియ 19 ఏళ్లు కూడా నిండకుండానే 2008లో యెమెన్‌కు వెళ్లింది. యెమెన్‌కు వెళ్లిన మూడేళ్లకి, కోచికి తిరిగి వచ్చిన నిమిష, టామీ థామస్‌ అనే ఆటో డ్రైవర్‌ను పెళ్లాడింది. పెళ్లయిన తర్వాత థామస్ కూడా నిమిషతో కలిసి యెమెన్ వెళ్లాడు. అక్కడ ఒక ఎలక్ట్రీషియన్‌కు అసిస్టెంట్‌గా పని చేశారు. అయితే 2012లో నిమిషకు ఒక కూతురు పుట్టాక, యెమెన్‌లో బిడ్డను పెంచడం కష్టమవుతుందని, థామస్ పాపతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చేశారు. రెండేళ్ల తర్వాత, 2014లో ఒక బిజినెస్ పార్టనర్‌తో నిమిష సొంతంగా ఒక క్లినిక్‌ను ప్రారంభించారు. యెమెన్‌లో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే స్థానికులు కచ్చితంగా భాగస్వామిగా ఉండాలి. నిమిషకు తలాల్ అబ్దో మాహ్ది అనే వ్యక్తి స్థానిక వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. నిమిష కూతురి బాప్టిజం కోసం భారత్‌కు వచ్చినప్పుడు, మాహ్ది కూడా ఆమెతో వచ్చారు. నిమిష ఇంటికి వెళ్ళినప్పుడు తన పెళ్లి ఫోటోలను మాహ్ది దొంగిలించారు. తరువాత నిమిషతో తనకి పెళ్లయినట్లు చిత్రీకరించారు. నిమిషను చిత్రహింసలు పెట్టి, క్లినిక్ ఆదాయం మొత్తం అక్రమంగా తీసేసుకునేవారనే ఆరోపణలు మాహ్ది మీద ఉన్నాయి. మాహ్దికు హానికరమైన మోతాదులో మత్తు మందు ఇచ్చి, తన మృతదేహాన్ని ఛిద్రం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొని, 2017లో నిమిష జైలుకు వెళ్లింది.

Exit mobile version