NTV Telugu Site icon

Chess Candidates 2024: చరిత్ర సృష్టించిన భారత యువ చెస్‌ ప్లేయర్ గుకేశ్!

Gukesh D

Gukesh D

Indian Grandmaster D Gukesh makes history: భారత యువ చెస్‌ ప్లేయర్‌ డీ గుకేశ్‌ చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో ‘క్యాండిడేట్స్‌’ విజేతగా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ 2024లో గుకేశ్‌ టైటిల్‌ విజేతగా నిలిచాడు. క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో 17 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్.. 9/14 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఫిడే క్యాండిడేట్స్‌ టైటిల్‌ను గెలిచిన రెండో భారత ఆటగాడిగా గుకేశ్‌ రికార్డుల్లో నిలిచాడు.

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో 13వ రౌండ్‌ ముగిసే వరకు గుకేశ్‌ 8.5 పాయింట్స్ సాధించి ఆధిక్యంలో నిలిచాడు. అమెరికాకు చెందిన హికరు నకమురతో జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకుని.. 9 పాయింట్లు సాధించాడు. మరోవైపు నెపోమ్నియాషి (రష్యా), ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా డ్రా అయింది. దాంతో వారిద్దరూ చెరో 8.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. దీంతో గుకేశ్‌ను టైటిల్‌ వరించింది.

Also Read: Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా..!

క్యాండిడేట్స్‌ టోర్నీ విజయంతో చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ పోరుకు గుకేశ్ అర్హత సాధించాడు. అక్కడ కూడా విజయం సాధిస్తే.. అతి పిన్న వయస్సులో ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌గా మనోడు రికార్డు సృష్టిస్తాడు. మాగ్నస్ కార్ల్‌సన్, కాస్పరోవ్‌ 22 ఏళ్ల వయసులో ఛాంపియన్లుగా నిలిచారు. గుకేశ్‌ 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. గతేడాది విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కి నెట్టి.. భారత్‌ టాప్‌ చెస్‌ ర్యాంకర్‌గా నిలిచాడు.