NTV Telugu Site icon

Divya Deshmukh: నా ఆట తప్ప అన్నీ చూశారు.. చెస్‌ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్‌ ఆరోపణలు

Divya Deshmukh

Divya Deshmukh

Chess Player Divya Deshmukh: ఓ టోర్నమెంట్‌లో తాను వీక్షకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్‌ ప్లేయర్‌ దివ్య దేశ్‌ముఖ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తన ఆట కన్నా తన అందం, జుట్టు, బట్టలు, మాటతీరు వంటి అనవసర విషయాలపై దృష్టి సారించారని వాపోయారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొన్నారు. అయితే ఈ టోర్నీలో మహిళా ప్లేయర్స్‌ను ప్రేక్షకులు ఎలా చిన్న చూపు చూశారో చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని తాను చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నట్లు తెలిపింది. చెస్ టోర్నీ చూసేందుకు వ‌చ్చిన ప్రేక్షకులు త‌న‌ను వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు భార‌తీయ చెస్ ప్లేయ‌ర్ దివ్య దేశ్‌ముఖ్ ఆరోపించారు.

Read Also: Rahul Gandhi: నితీష్‌ కూటమి నుంచి అందుకే వైదొలిగారు.. మౌనం వీడిన రాహుల్‌

“ప్రేక్షకులు నా అందాన్ని గమనించడం పట్ల గర్వంగా ఉంది. కానీ వారు నా ఆటను పట్టించుకోలేదు. అది తప్ప అన్నీ చూశారు. నేను వేసుకున్న బట్టలు, నా జుట్టు, నేను మాట్లాడే విధానం.. ఇలా సంబంధం లేని అన్ని విషయాలు పట్టించుకున్నారు” అని చెస్‌ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ ఆ పోస్టులో చెప్పింది. ఈ టోర్నీలో దివ్య దేశ్‌ముఖ్ 12వ స్థానంలో నిలిచింది. చెస్ లో మేల్ ప్లేయర్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని, మహిళా ప్లేయర్స్‌ను వాళ్ల ఆట తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ అంచనా వేస్తున్నట్లు దివ్య దేశ్‌ముఖ్‌ ఆరోపించింది. ఇది చాలా బాధాకర విషయమన్న ఆమె.. మహిళలు చెస్ ఆడే సమయంలో వాళ్లు ఎంత బాగా ఆడతారో ఎవరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. నాగ‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల అంత‌ర్జాతీయ మాస్టర్‌ ప్లేయ‌ర్ దివ్య దేశ్‌ముఖ్‌ గ‌త ఏడాది ఏషియ‌న్ వుమెన్స్ చెస్ చాంపియ‌న్‌షిప్ గెలుచుకుంది.