Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్‌.. జపాన్‌ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!

  • బీహార్‌లోని రోహ్తాస్‌కు చెందిన అభిషేక్‌ ఆనంద్‌
  • జపాన్‌ జాతీయ క్రికెట్‌ జట్టులో ఆటగాడిగా..
  • అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్ ప్రయాణం ఇలా..
Abhishek Anand

Abhishek Anand

Abhishek Anand: క్రికెట్‌.. భారత్ లో ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. భారతీయులు చాలామంది ఉన్నత విద్యల కోసం, ఆపై ఉద్యోగాల కోసం ఇతర దేశాలలో స్థిరపడినవారు ఎందరో. ఇందులో బీహార్‌లోని రోహ్తాస్‌ నుంచి ఐఐటీ కాన్పూర్‌ వరకు.. అక్కడి నుంచి జపాన్‌ జాతీయ క్రికెట్‌ జట్టు వరకు అభిషేక్‌ ఆనంద్‌ కూడా ఒకడు. భారత్‌, జపాన్‌ మధ్య సెప్టెంబర్‌ 22న జరగనున్న చారిత్రాత్మక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు అభిషేక్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆయనను బీహార్‌కు చెందిన వ్యక్తిగా ఉండి జపాన్‌ తరఫున క్రికెట్‌ ఆడటంపై ప్రశ్నించగా.. “బిహారీ ఎక్కడ లేడు భాయ్‌” అంటూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది.

అయితే భారత్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ ఆనంద్‌ ఆడే అవకాశం కనపడ్డం లేదు. తొచిగీ ప్రిఫెక్చర్‌లోని సానో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్‌ కోసం జపాన్‌ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో భారత అభిమానులు అభిషేక్‌ను మైదానంలో చూడలేరు.

అభిషేక్‌ ఆనంద్‌కు జపాన్‌కు వెళ్లిన తర్వాతే క్రికెట్‌తో అనుబంధం ఏర్పడలేదు. ఐఐటీ కాన్పూర్‌లో కెమిస్ట్రీ చదువుతున్న సమయంలోనూ ఆయన క్రికెట్‌ ఆడేవారు. అంతేకాదు, ఆ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం టోక్యో వెళ్లిన అభిషేక్‌.. అక్కడ కూడా క్రికెట్‌ను వదిలిపెట్టలేదు. ఉద్యోగం చేస్తూనే జపాన్‌లో క్లబ్‌ క్రికెట్‌ ఆడుతూ వచ్చారు. స్థానిక స్థాయిలో ఆయన చూపిన ప్రతిభతో జపాన్‌ జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. ఇలా ఉద్యోగం, క్రికెట్‌ను సమన్వయం చేసుకుంటూ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు.

28 ఏళ్ల అభిషేక్‌ ఆనంద్‌ 2025 మే 9న కుక్‌ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా జపాన్‌ తరఫున టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత జపాన్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారారు. ఇప్పటివరకు 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆయన 275 పరుగులు చేశారు. ఇందులో ఆయన అత్యధిక స్కోరు 55 పరుగులు. బౌలింగ్‌లో ఒక వికెట్‌ కూడా తీసుకున్నారు. క్రికెట్‌ను పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంచుకోకపోయినా.. ఉద్యోగంతో పాటు ఆటను కొనసాగిస్తూ జాతీయ జట్టుకు చేరడం అభిషేక్‌ ఆనంద్‌ కథను ప్రత్యేకంగా నిలిపింది.

భారత్‌, జపాన్‌ క్రికెట్‌ జట్లు తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడనున్నాయి. భారత్‌-జపాన్‌ దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఆసియా క్రీడలకు ముందు ఇరు జట్లకు ఇది సన్నాహక మ్యాచ్‌గా కూడా ఉపయోగపడనుంది.

జపాన్‌ జట్టు:

కెండెల్‌ కడోవాకి-ఫ్లెమింగ్‌ (C), చార్లీ హారా-హింజ్‌, బెంజమిన్‌ ఇటో-డేవిస్‌, అలిస్టర్‌ కడోవాకి-ఫ్లెమింగ్‌, కోహెయి కుబోటా, జేక్‌ కుసుదా-నైరన్‌, వటారు మియౌచి, రియో సకురానో-థామస్‌, అలెక్స్‌ షిరాయ్‌-పాట్మోర్‌, షోమా సుగయా-స్లేటర్‌, డెక్లాన్‌ సుజుకి, త్సుయోషి తకాడా, ఇబ్రహీం తకాహాషి, మకోటో తనియామా, లాచ్లాన్‌ యమామోటో-లేక్‌ జపాన్‌ జట్టులో ఉన్నారు.