NTV Telugu Site icon

IND W vs NZ W: శతకొట్టిన స్మృతి మంధాన.. ఇండియా విజయం

Ind W

Ind W

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 233 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో రాణించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 59 పరుగుల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.

లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ షెఫాలీ వర్మ 11 బంతుల్లో 12 పరుగులకే ఔట్ అయింది. నాలుగో ఓవర్లో గేజ్ వద్ద హన్నా రోవ్ చేతికి చిక్కింది. ఆ తర్వాత యాస్తికా భాటియాతో కలిసి స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 21వ ఓవర్లో యాస్తికా సోఫీ డివైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. యాస్తికా 49 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసింది.

Chhattisgarh: పెరోల్‌పై విడుదలైన రేపిస్ట్.. సొంత కూతురు, కొడలిపై అత్యాచారం..

మంధాన మూడో వికెట్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి 117 పరుగుల బలమైన భాగస్వామ్యం నెలకొల్పింది. 40వ ఓవర్లో మంధానను హన్నా బౌల్డ్ చేసింది. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసింది. మంధాన వన్డే కెరీర్‌లో ఇది ఎనిమిదో సెంచరీ. భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. కాగా.. హర్మన్‌ప్రీత్ 63 బంతుల్లో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు ఉన్నాయి. జెమిమా రోడ్రిగ్స్ 18 బంతుల్లో 22 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలింగ్‌లో హన్నా రోవ్ 2 వికెట్లు పడగొట్టింది. సోఫియా డివైన్, ఫ్నాన్ జోనాస్ తలో వికెట్ తీశారు.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ జట్టు తొలి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 14 పరుగులు మాత్రమే చేసింది. ఏడో ఓవర్‌లో న్యూజిలాండ్‌కు తొలి దెబ్బ తగిలింది. 4 పరుగుల వద్ద సుజీ బేట్స్ రనౌట్ అయింది. సైమా ఠాకూర్ రెండో వికెట్ తీసింది. ఆమె ఎనిమిదో ఓవర్ తొలి బంతికి లారెన్‌ను (1) ఔట్ చేసింది. ప్రియా మిశ్రా 11వ ఓవర్‌లో కెప్టెన్ సోఫీ డివైన్‌ను బౌల్డ్ చేసింది.

జార్జియా ప్లిమ్మర్ 67 బంతుల్లో 39 పరుగులు చేసింది. ఆమె 6 ఫోర్లు కొట్టింది. 19వ ఓవర్లో ప్రియా ప్లిమ్మర్‌ను అవుట్ చేసింది. 25వ ఓవర్లో మ్యాడీ గ్రీన్ రనౌట్ అయింది. ఇసాబెల్లా గేజ్ (49 బంతుల్లో 25) ఆరో వికెట్‌కు బ్రూక్ హాలిడేతో కలిసి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీప్తి 39వ ఓవర్లో గేజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటైంది. 46వ ఓవర్లో దీప్తి హాలిడే ఇన్నింగ్స్‌ను ముగించింది. 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసింది. హన్నా రోవ్ 11, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్ తలో 2 పరుగులు చేశారు. లీ తహుహు 14 బంతుల్లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. భారత్ బౌలింగ్‌లో దీప్తి శర్మ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టింది. ప్రియా మిశ్రా 2, రేణుకా సింగ్.. సైమా ఠాకూర్ తలో వికెట్ తీశారు.