భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ నాకౌట్‌లలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ రికార్డు ఇదివరకు న్యూజీలాండ్ మెన్స్ జట్టుపై ఉంది. ఆక్లాండ్ వేదికగా 2015 ప్రపంచకప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 298 రన్స్ కివీస్ ఛేదించింది. ఈ రికార్డును భారత మహిళా జట్టు బద్దలు కొట్టింది.
భారత మహిళా జట్టు మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే చరిత్రలో కూడా ఇదే (339 పరుగులు) అత్యధిక ఛేదన. ఈ ప్రపంచకప్‌లోనే భారత్‌పై ఆస్ట్రేలియా 331 పరుగులు ఛేదించింది. ఈ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో ఓడించి.. ఫైనల్‌కు చేరడం ఇది భారత్‌కు రెండోసారి. 2017లో కంగారులను భారత్ ఓడించింది. ఇక మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం టీమిండియాకు ఇది మూడోసారి. 2005, 2017 సహా 2025లో ఫైనల్ చేరింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ ఢీకొంటుంది. ఈసారి కొత్త ఛాంపియన్‌ను మనం చూడబోతున్నాం.
సెమీఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17×4, 3×6) సెంచరీ చేయగా.. ఎలిస్ పెర్రీ (77; 88 బంతుల్లో 6×4, 2×6), ఆష్లీ గార్డ్‌నర్ (63; 45 బంతుల్లో 4×4, 4×6) హాఫ్ సెంచరీలు బాదారు. భారత బౌలర్ శ్రీచరణి (2/49) రాణించింది. భారీ లక్ష్యాన్ని టీమిండియా 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్; 134 బంతుల్లో 14×4) హీరోచిత శతకం బాదింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (89; 88 బంతుల్లో 10×4, 2×6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. దీప్తి శర్మ (24; 17 బంతుల్లో 3×4), రిచా ఘోష్ (26; 16 బంతుల్లో 2×4, 2×6), అమన్‌జ్యోత్ కౌర్ (15 నాటౌట్; 8 బంతుల్లో 2×4) కీలక పరుగులు చేశారు.
