IND vs SL: భారత్‌-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..

Ind Vs Sl

Ind Vs Sl

IND vs SL: శ్రీలంక క్రికెట్ జట్టు డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, ఈ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ కీలక మార్పు చేయనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డేను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారీ స్థాయిలో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను పునరుద్ధరించడంతో పాటు అత్యాధునిక సబ్-ఎయిర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. స్టేడియం మౌలిక సదుపాయాలను కూడా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ పనుల కారణంగా కొంతకాలం పాటు అక్కడ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని సమాచారం.

ఈ ఆధునికీకరణ ప్రభావం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ క్రికెట్‌పైనా పడనుంది. ఢిల్లీ రంజీ జట్టు గుజరాత్, సర్వీసెస్, మహారాష్ట్ర జట్లతో ఆడాల్సిన కొన్ని హోమ్ మ్యాచ్‌లను అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడవచ్చు. మహిళల క్రికెట్, జూనియర్ స్థాయి టోర్నమెంట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశవాళీ మ్యాచ్‌ల నిర్వహణ కోసం డీడీసీఏ పాలమ్, జామియా మిలియా క్రికెట్ మైదానాలను ప్రత్యామ్నాయ వేదికలుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

భారత్‌-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్

* డిసెంబర్ 13: తొలి వన్డే – అహ్మదాబాద్
* డిసెంబర్ 16: రెండో వన్డే – చెన్నై
* డిసెంబర్ 19: మూడో వన్డే – అహ్మదాబాద్

భారత్‌-శ్రీలంక టీ20 సిరీస్ షెడ్యూల్

* డిసెంబర్ 22: తొలి టీ20 – రాజ్‌కోట్
* డిసెంబర్ 25: రెండో టీ20 – కటక్
* డిసెంబర్ 27: మూడో టీ20 – పుణె.