IND vs PAK U19 Asia Cup Final: భారత్ ముందు భారీ టార్గెట్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!!

India Vs Pakistan U19 Asia Cup 2026 Final

India Vs Pakistan U19 Asia Cup 2026 Final

India vs Pakistan U19 Asia Cup Final 2026: అండర్-19 ఏషియా కప్ 2026 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయి. ఒమన్‌లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు భారత్‌కు 338 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ సెంచరీతో రాణించాడు. ఇప్పుడు అందరి చూపు టీమిండియా ఓపెనర్, వీరేంద్ర సెహ్వాగ్‌ కొడుకైన ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavart Sehwag) పైనే ఉంది.

పాకిస్థాన్ బ్యాటింగ్ (Batting) విషయానికి వస్తే.. ఓపెనర్లు ఉస్మాన్ ఖాన్, హయామ్ ఖాన్ మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. 21 పరుగులు చేసిన హయామ్‌ను కావ్యా పటేల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్ ఖాదిర్‌తో కలిసి ఉస్మాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని (Partnership) నెలకొల్పారు. అబ్దుల్ ఖాదిర్ కేవలం 54 బంతుల్లోనే 80 పరుగులు బాదేయగా, అందులో 8 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇతని వికెట్‌ను అర్జున్ రాజ్‌పుత్ పడగొట్టాడు. మరోవైపు ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 111 బంతులు ఎదుర్కొన్న ఉస్మాన్.. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 107 పరుగులు చేసి మెరిశాడు. ఇతని వికెట్‌ను కూడా కావ్యా పటేలే తీశాడు. భారత బౌలర్లలో కావ్యా పటేల్ 4, చిగురుపాటి వెంకట 3, అర్జున్ రాజ్‌పుత్ ఒక వికెట్ తీశారు.

ఇక, ఈ టోర్నమెంట్‌లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ (Final) చేరింది. సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. మరోవైపు పాకిస్థాన్ జట్టు సెమీ-ఫైనల్ (Semi-final) మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9 వికెట్లతో ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ (Group stage) మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ప్లేయర్స్ పక్కా వ్యూహంతో బరిలోకి దిగారు. ఇప్పటివరకు భారత్ 8 సార్లు ఈ అండర్-19 ఏషియా కప్ టైటిల్‌ను (Title) కైవసం చేసుకోగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు రెండేసి సార్లు గెలిచాయి. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఛాంపియన్‌గా (Champion) నిలిచింది.