India vs Pakistan: ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ పసిడి పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న ఈ హైవోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్‌లో ఆడిన జట్టునే భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దింపింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించి స్వర్ణం ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉంది. జపాన్ దేశం నిషిన్ (Nisshin) నగరంలోని కోరోగి అథ్లెటిక్ పార్క్ (Kōrogi Athletic Park)లో ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
గత మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే 38 రన్స్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌లో దుమ్ము రేపేస్తాడా? అని అందరూ ఎదురు చూస్తున్నారు.. ఇక మైదానంలో ఆటతో పాటు మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు కనీసం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోకపోవడం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు బంగారు పతకం దక్కడమే కాకుండా, గతంలో సాధించిన టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్నట్లవుతుంది. ఇక మ్యాచ్‌కు ముందు మాట్లాడిన తిలక్ వర్మ తన బౌలింగ్ ప్లాన్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీమ్‌లో ప్రత్యర్థి వైపు లెఫ్ట్ హ్యాండర్ ఉంటే తాను ఖచ్చితంగా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. పరిస్థితికి, కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్లు నడుచుకోవడానికి తను రెడీగా ఉన్నానని తిలక్ స్పష్టం చేశాడు.
భారత్ vs పాకిస్థాన్ ముఖాముఖి (టీ20)
మొత్తం మ్యాచ్‌లు: 17
భారత్ 14 గెలిచింది
పాకిస్తాన్ 3 గెలిచింది
జట్లు:
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సాహిబ్జాదా ఫర్హాన్(సి), మాజ్ సదాకత్, ఉస్మాన్ ఖాన్(w), సైమ్ అయూబ్, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్, సాద్ మసూద్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మోకిమ్
భారత్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), శ్రేయాస్ అయ్యర్(c), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా

