NTV Telugu Site icon

IND vs NED: నేడు నెదర్లాండ్స్‌తో భారత్‌ ఢీ.. తుది జట్టులో రెండు మార్పులు?

India Vs Netherlands

India Vs Netherlands

IND vs NED Preview and Playing 11: వన్డే ప్రపంచకప్‌ 2023లో జోరుమీదున్న భారత్‌ తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. సెమీస్‌ స్థానాన్ని ఇప్పటికే ఖాయం చేసుకున్న టీమిండియా.. వరుసగా తొమ్మిదో విజయంపై కన్నేసింది. ట్రోఫీయే లక్ష్యంగా సాగుతున్న భారత్‌.. మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీపావళి రోజు భారత్ ఎలా వెలుగులు విరజిమ్ముతుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కొత్త ఘనత నమోదవుతుంది. 2003 ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా 8 మ్యాచ్‌లు నెగ్గింది. మరోవైపు స్వదేశానికి వెళ్లిపోయే ముందు గట్టి పోటీ ఇవ్వాలని నెదర్లాండ్స్‌ భావిస్తోంది.

భారత తుది జట్టులో మార్పులు జరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. జోరుమీదున్న బ్యాటర్లకు విశ్రాంతినిచ్చే అవకాశం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే చెప్పాడు. ఎలాంటి ప్రయోగాలు ఉండవని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా స్పష్టం చేశాడు. అయితే జట్టులో 1-2 మార్పులను కొట్టిపారేయలేం. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చి.. ప్రసిద్ధ్‌ కృష్ణ, ఆర్ అశ్విన్‌లను తీసుకోవచ్చు. భారత్ బాగా ఆడుతున్నా.. సూర్యకుమార్‌ యాదవ్ ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. సూర్య ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 21.25 సగటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతడు ఫామ్ అందుకోవడానికి నెదర్లాండ్స్‌ మాక్ చక్కటి అవకాశం.

Also Read: Gold Price Today: పండుగవేళ దిగొచ్చిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

బ్యాటింగ్‌కు అనుకూలించే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయం. ప్రపంచకప్‌ 2023లో ఇక్కడ పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 367 పరుగులు చేసింది. న్యూజీలాండ్ కూడా పాక్‌పై 401 పరుగులు బాదింది. మొదట భారత్‌ బ్యాటింగ్‌ చేస్తే భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, కుల్దీప్/అశ్విన్‌, బుమ్రా/ప్రసిద్ధ్‌, షమీ, సిరాజ్‌.
నెదర్లాండ్స్‌: ఒదౌడ్‌, బారెసి, ఆకర్‌మ్యాన్‌, సిబ్రాండ్‌, ఎడ్వర్డ్స్‌, డి లీడ్‌, తేజ నిడమానూరు, వాన్‌ బీక్‌, వాండెర్‌మెర్వ్‌, ఆర్యన్‌ దత్‌, మీకెరన్‌.