IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!

India Vs Ireland

India Vs Ireland

IND vs IRE: ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత జట్టు నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.. ఈరోజు (జూన్ 28) బెల్‌ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ జట్టు భారత్‌పై విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యువ భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో 148 పరుగులకే కుప్పకూలింది.

ఇక, ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. మొదటి మ్యాచ్‌లో అతనికి చోటు దక్కలేదు. అయితే, గత మ్యాచ్ ఓటమి నేపథ్యంలో సంజూ శామ్సన్‌కు విశ్రాంతినిచ్చి, అతని స్థానంలో వైభవ్‌ను ప్లేయింగ్-11లోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు. గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన వాషింగ్టన్ సుందర్ (1 ఓవర్లో 19 పరుగులు, బ్యాటింగ్‌లో 9 పరుగులు) స్థానంలో రవి బిష్ణోయ్ లేదా ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆల్‌రౌండర్ సూర్యాంశ్ శెడ్గేను జట్టులోకి తీసుకునే యోచనలో మేనేజ్‌మెంట్ ఉందట. అలాగే, మొదటి టీ20లో 57 పరుగులు సమర్పించుకున్న ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అతని స్థానంలో ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ సైతం ఆడని ప్రిన్స్ యాదవ్‌కు టీ20 క్యాప్ దక్కవచ్చని చెబుతున్నారు. మరోవైపు, ఐర్లాండ్ జట్టు ఇదే జోరును కొనసాగించి భారత్‌పై తొలిసారి చారిత్రాత్మక టీ20 సిరీస్ గెలవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఐర్లాండ్ 1-0తో ముందంజలో ఉంది. టాస్ పడిన తర్వాతే తుది జట్టుపై పూర్తి స్పష్టత రానుంది.

ఇరు జట్ల అంచనాలు:

India Predicted Playing XI: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/సూర్యాంశ్ శెడ్గే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

Ireland Predicted Playing XI: టిమ్ టెక్టార్, రాస్ అడైర్, హ్యారీ టెక్టార్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్/కెప్టెన్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెకార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హాలార్డ్.