భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో ఆదివారం జరగనున్న మూడో, నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. గత కొన్ని మ్యాచ్‌లుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడం, అతడిని బెంచ్‌కే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సిరీస్‌లో భారత జట్టు యాజమాన్యం బ్యాటింగ్ కూడా చేయగల ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లకు జట్టులో చోటు కల్పిస్తూ, వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టేసింది. రెండో వన్డేలో కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను మాత్రమే జట్టులోకి తీసుకున్నారు.
టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా తీవ్రంగా మండిపడ్డారు. కుల్దీప్ యాదవ్‌కు జట్టులో ఎందుకు ఎల్లప్పుడూ అన్యాయమే జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. మేనేజ్‌మెంట్ అతడి పట్ల సరైన రీతిలో ప్రవర్తించడం లేదని, అన్ని ఫార్మాట్లలోనూ అతడికి ఇదే పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జట్టు వ్యూహాలు మారినా, జట్టు ప్రదర్శన సరిగ్గా లేకపోయినా, లేదా బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయాలనుకున్నా.. ముందుగా జట్టు నుంచి తొలిగిపోయేది కుల్దీప్ యాదవేనని ఆయన మండిపడ్డారు.
చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికీ కుల్దీప్ తక్కువ మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడని, ఎవరైనా కాస్త మెరుగ్గా రాణించినా లేదా బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్ అందుబాటులోకి వచ్చినా కుల్దీప్‌ను వెంటనే పక్కన పెట్టేస్తున్నారని చోప్రా పేర్కొన్నారు. ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్ ఎంతో అవసరమని, అలాంటి సమయంలో కుల్దీప్ యాదవ్ గురించి ఆలోచించకపోవడం చాలా విచారకరమని అన్నారు. కాగా, గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్ష్ దూబేను మూడో వన్డే కోసం భారత జట్టులోకి ఎంపిక చేశారు. రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తూ పరుగు తీసే క్రమంలో సుందర్ గాయపడటంతో, రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్ మరియు ఫీల్డింగ్‌కు రాలేకపోయాడు.

