బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women’s Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!

Women's Asia Cup 2026

Women's Asia Cup 2026

Women’s Asia Cup 2026: మహిళల ఆసియా కప్‌ 2026లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు వచ్చిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ ఇన్నింగ్స్‌లో షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. ఆమె 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసింది. షఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ప్రాతికా రావల్ 20 పరుగులు చేయగా, రిచా ఘోష్ 16 బంతుల్లో 21 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 28 బంతుల్లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీప్తి శర్మ కేవలం 6 బంతుల్లో 13 పరుగులు చేసి జట్టు స్కోరును 149కి చేర్చడంలో సహకరించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతూన్ రెండు వికెట్లు పడగొట్టగా, మారుఫా అక్తర్, నహిదా అక్తర్, రబేయా ఖాన్ తలో వికెట్ తీశారు.

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. దిలారా అక్తర్ 21, జుయైరియా ఫెర్దౌస్ 14, సోభనా మొస్తరీ 18 పరుగులకె పెవిలియన్ చేరారు. బంగ్లా కెప్టెన్ నిగార్ సుల్తానా 19 పరుగులు చేయగా, షోర్నా అక్తర్ 18 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. అయితే భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 109/7కే పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. నందని శర్మ 2 వికెట్లు తీయగా.. శ్రీ చరణి, ప్రేమా రావత్ చెరో వికెట్ సాధించారు. దీంతో భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించి మహిళల ఆసియా కప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.