India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?

India U19 Vs Pakistan U19

India U19 Vs Pakistan U19

India U19 vs Pakistan U19: చిరకాల ప్రత్యర్థులు మరోసారి అల్ అమ్రాత్ వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆదివారం నవంబర్ 8న ఉదయం 10:30 గంటలకు భారత్ అండర్-19 (India Under-19), పాకిస్థాన్ అండర్-19 (Pakistan Under-19) జట్లు గ్రూప్-ఏ (Group-A) మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నమెంట్‌లో రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లను గెలుచుకుని జోరు మీదున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరులో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు పాయింట్ల కోసం మాత్రమే కాదు, గతేడాది డిసెంబర్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final) ఓటమికి బదులు తీర్చుకునే అరుదైన అవకాశం. ఆ తుదిపోరులో పాకిస్థాన్ చేతిలో 191 పరుగుల భారీ తేడాతో భారత్ పరాజయంపాలైంది. ఆ తర్వాత జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో (Under-19 World Cup) మన కుర్రాళ్ళు అద్భుతంగా పుంజుకుని పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇప్పుడు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి.

యూత్ వన్డే క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు అంటేనే ప్రేక్షకులకు పూనకాలు ఖాయం. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 30 మ్యాచ్‌లు జరుగగా, టీమిండియాదే పైచేయిగా ఉంది. భారత్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్థాన్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ టై (Tie) అయింది. అత్యధిక టీమ్ స్కోరు (Team Score) రికార్డు పాకిస్థాన్ పేరిట ఉంది. 2025 ఆసియా కప్‌లో భారత బౌలర్లపై విరుచుకుపడిన పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఇక అత్యల్ప స్కోరు విషయానికి వస్తే.. 2018 అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో (Semi-Final) భారత్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు, భారత బౌలర్ల ధాటికి కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 203 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

వ్యక్తిగత రికార్డులను పరిశీలిస్తే.. 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఆటగాడు సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో 172 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అత్యధిక వ్యక్తిగత స్కోరు (Individual Score) నమోదు చేశాడు. ఇక బౌలింగ్‌లో పాకిస్థాన్ పేసర్ అన్వర్ అలీ 2006లో 9 ఓవర్లలో కేవలం 35 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా, అత్యధిక వికెట్లు (Most Wickets) తీసిన బౌలర్‌గా భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా నిలిచాడు. అతడు పాక్‌పై 7 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. అలాగే పాక్ మాజీ బ్యాటర్ సామి అస్లాం భారత్‌పై అత్యధికంగా 514 పరుగులు చేసి అత్యుత్తమ బ్యాటర్‌గా (Best Batsman) రికార్డు సృష్టించాడు. మరి ఈ తాజా పోరులో మన యువ భారత్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో వేచి చూడాలి.