Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్‌ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..

Under 19

Under 19

ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026లో భారత యువ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. గురువారం ఒమన్‌లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ అండర్-19 జట్టుపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఆఫ్ఘన్ బ్యాటర్లు భారీ స్కోరు చేయలేకపోయారు.

అనంతరం 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని, ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆరంభంలోనే వికెట్లు తీయడంలో ఆఫ్ఘన్ బౌలర్లు విఫలమవ్వడంతో భారత ఓపెనర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా కెప్టెన్ రాయ్‌చందాని దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 117 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సెహ్వాగ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వీకే వినీత్ కూడా అదే జోరును కొనసాగించాడు. మధ్యాహ్నం వేళ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో భారత బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. కెప్టెన్ రాయ్‌చందాని తృటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, వినీత్ తన అర్ధసెంచరీని పూర్తి చేసుకుని జట్టును విజయతీరాలకు చేర్చాడు. నూర్ అలీ నియాజీ వేసిన 36.5వ బంతిని వినీత్ భారీ సిక్సర్‌గా మలచడంతో భారత్ 36.5 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఎల్లుండి జరగనున్న తుది పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.