NTV Telugu Site icon

Hong Kong Sixes Tournament: హాంకాంగ్ సిక్సెస్‌లో టీమిండియా.. టోర్నీ రూల్స్ భలే ఉన్నాయే! తప్పక తెలుసుకోవాల్సిందే

Hong Kong Sixes Tournament

Hong Kong Sixes Tournament

Here is Hong Kong Sixes Tournament Rules: ఐకానిక్ క్రికెట్ టోర్నమెంట్ ‘హాంకాంగ్ సిక్సెస్‌ టోర్నమెంట్’ మరలా అభిమానులను అలరించడానికి సిద్దమైంది. ఈ టోర్నీ నవంబర్ 1 నుంచి 3 వరకు జరగనుందని క్రికెట్ హాంకాంగ్ సోమవారం తన ఎక్స్ ద్వారా తెలిపింది. 1992లో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. 2017 వరకు కొనసాగింది. 2017 నుంచి 2023 వరకు ఏడేళ్ల పాటు నిర్వహించలేదు. 2024లో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి తిరిగి వస్తోంది. ఈ టోర్నీలో భారత్ కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది.

2024 హాంకాంగ్ సిక్సెస్‌ టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్‌, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు పాల్గొననున్నాయి. ప్రతి జట్టులో ఆరుగురు ప్లేయర్స్ ఉంటారు. ఒక మ్యాచ్‌లో ప్రతి జట్టు 5 ఓవర్లు ఆడుతుంది. ఈ టోర్నీ సాధారణ మ్యాచ్‌ల్లో ప్రతి ఓవర్‌కు 6 బంతులే వేస్తారు. కానీ.. ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం ఓవర్‌కు ఎనిమిది బంతులు ఉంటాయి. వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. వైడ్ లేదా నో బాల్‌కు రెండు ఎక్స్‌ట్రా పరుగులు లభిస్తాయి.

5 ఓవర్లు పూర్తికాక ముందే ఐదు వికెట్లు పడితే టీమ్ ఆలౌట్ కాదు. ఆరో ఆటగాడు (నాటౌట్ బ్యాటర్) బ్యాటింగ్‌ను కొనసాగిస్తాడు. అయితే ఐదవ వికెట్‌గా ఔటైన బ్యాటర్‌ రన్నర్‌గా ఉంటాడు. అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు. ఆరో ప్లేయర్ మాత్రమే ఎప్పుడూ స్ట్రైకింగ్ చేస్తాడు. ఆరవ వికెట్ కూడా పడితే.. అప్పుడు టీమ్ ఆలౌట్ అవుతుంది. ఇక ఓ బ్యాటర్ 31 పరుగులు చేస్తే.. అతడు రిటైర్డ్‌ హర్ట్‌ అవ్వాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాటర్లందరూ ఔట్ లేదా రిటైర్డ్‌ హర్ట్‌ అయిన తర్వాత మరలా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుంది.

Also Read: Honda vs Hero: హీరో మోటోకార్ప్‌కు షాకిచ్చిన హోండా!

గతంలో జరిగిన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీలు పాల్గొన్నారు. వీరితో పాటు సనత్ జయసూర్య, షేన్ వార్న్, వసీమ్ అక్రమ్, షోయబ్ మాలిక్, గ్లెన్ మాక్స్‌వెల్ కూడా పాల్గొన్నారు. ఈ టోర్నీలో భారత్ 2005లో ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో పాకిస్థాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా టీమ్స్ అత్యంత విజయవంతమైన జట్లు.